ఇలాంటి పాటలు విని వినీ నిజంగానే అహల్యా మాత శాపము చేత రాయిగా మారిపోయిందనే చాలామంది అనుకుంటాము. దీనిలో నిజమెంతుంది?
ఈమధ్య ఒక ఫంక్షన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాట్లాడిన వీడియో చూశాను. ఆయన వాల్మీకి రామాయణంను కోట్ చేస్తూ అహల్యా గౌతముల గురించి వివరించి అప్పటి తరం వాళ్ళకంటే మనం మెచ్యూర్డ్ కాదు అని వ్యాఖ్యానించారు. అదృష్టవశాత్తూ నాకు వాల్మీకి రామాయణం (శ్రీమాన్ పుల్లెల శ్రీరామచంద్రుడి గారు వ్యాఖ్యానంచేస్తూ తెలుగులో అనువదించినది) దొరికింది. ఎందరో రామాయణాన్ని అనువదించిన వారు, తమదైన శైలిలో వ్రాసిన వారూ వున్నారు. వారిలో కొందఱు తమ కల్పనని కూడా జోడించి వ్రాశారు. 'కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత' అనే సామెత వుంది కానీ వ్రాసిన వారందరూ మహాపండితులు, మేధావులు, లబ్దప్రతిష్టులు కాబట్టి మనం ఈ మాట అనడానికి సరిపోము. మనకి వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణమే ప్రామాణికం. అందుచేత దానిలో వ్రాసింది మాత్రమే నిజమని నమ్మాలి.
అహల్యా జన్మవృత్తాంతము
అహల్యను బ్రహ్మ దేవుడు సమస్త జీవకోటిలోని అందాన్నంతా ప్రోగుచేసి సృష్టించాడు. ఇంత సౌందర్యవతి మహా తపస్సంపన్నుడు మహాముని అయిన గౌతముని ఆశ్రమంలో పెంచడానికి యిచ్చాడు. ఆమెకి వయస్సు రాగానే మహా యోగ్యుడైన వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేయాలని సంకల్పించి ఎందరినో చూసి ఆఖరికి గౌతమ మహర్షే అత్యంత యోగ్యుడుగా భావించి ఆయనకే యిచ్చి వివాహం జరిపిస్తాడు. ఆమె కూడా అత్యంత భక్తితో పతిని సేవించుకుంటుంది. గౌతమ మహర్షి తపస్సుకి ముల్లోకాలూ గడగడలాడుతుండగా దేవేంద్రుడు ఆ తపస్సు భంగం కలిగించడానికి ఉపాయం ఆలోచిస్తూ వుంటాడు. [ఈ ఉపోద్ఘాంతం వాల్మీకి రామాయణం బాలకాండములో కనబడలేదు. వికీపీడియానుంచి తీసుకున్నాను.]
దేవేంద్రుడు
ఈ విషయం రామాయణ బాలకాండము - 48వ సర్గములో వుంది. గౌతమ మహర్షిని ఏమీ చేయలేము అని గ్రహించి అహల్యాదేవి పాతివ్రత్యాన్ని భంగపరిస్తే గౌతమ ముని తపశ్శక్తిని ఆటంకపరచవచ్చు అని దేవేంద్రుడు భావిస్తాడు. మహర్షి లేని సమయంలో ఆయనలా వేషం వేసుకుని వెళ్తాడు. ఇక్కడ రామాయణం ప్రకారం అహల్యా దేవికి అతడు తన భర్త వేషంలో వచ్చిన దేవేంద్రుడు అని తెలుసు. అయినా అంత తేజోవంతుడు పరాక్రమవంతుడు అయిన ఇంద్రుణ్ణి చూసి చలిస్తుంది. తర్వాత ఆవిడే గౌతముని కంట పడకుండా వెళ్లిపొమ్మని ఇంద్రుడికి సూచిస్తుంది. గౌతమమహర్షి చూడనే చూశాడు. జరిగినది గ్రహించి ఇంద్రుడికి అండములు (వృషణాలు?) పడిపోవుగాక అని శపిస్తాడు. తర్వాత దేవతలు మేక అండములు ఇంద్రునకు అమరుస్తారు. అందుకే ఆయనని మేషవృషణుడు అనికూడా అంటారు.
అహల్యకు శాపం
గౌతమముని అహల్యను వేల సంవత్సరముల పాటు మూడు లోకాల్లో ఎవరికీ కనబడకుండా ఇక్కడే వుండి కేవలం వాయు భక్షణంతో తపస్సు చేసుకొమ్మని శాపమిస్తాడు. ఆ తరువాత దశరధ నందనుడు శ్రీరాముడు ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు నీలోని లోభ మోహములు తొలగి నిజ స్వరూపము ధరించి తిరిగి నాతొ కలిసి జీవించగలవు అని శాప విమోచనం కూడా చెబుతాడు. ఇది రామాయణ బాలకాండము - 49వ సర్గములో వుంది.
తాటకి, మారీచుల సంహారం తర్వాత రామ లక్ష్మణులు బ్రహ్మర్షి విశ్వామిత్రునితో కలిసి గౌతముని ఆశ్రమానికి వచ్చినప్పుడు అహల్య తన నిజరూపం ధరించి వారికి ఆతిథ్యమిచ్చి పూజించి శాప విమోచనురాలైంది. రామ లక్ష్మణులు ఆమె పాదాలు తాకి నమస్కరించారు. గౌతమ మహర్షి కూడా వచ్చి రామలక్షణులకు అతిథి పూజ చేసి అహల్యా సమేతంగా తిరిగి తపస్సుకి వెళ్ళిపోతాడు.
దీనిని బట్టి అహల్యా మాత కేవలం ఎవరికీ కనబడకుండా ఘోర తపస్సులో వుంది తప్ప రాయిగా మారలేదు. రాముని పాదం తాకి తిరిగి స్త్రీగా మారలేదు.
ముగింపు
ఈ వృత్తాంతం తరువాత విశ్వామిత్రుడు రామ లక్షములతో కలిసి జనక మహారాజు యాగం చేస్తున్న మిథిలానగరికి చేరుకుంటారు. అక్కడ అహల్యా గౌతముల జ్యేష్ఠపుత్రుడు శతానందుడనే మహా తపస్వి విశ్వామిత్రుడిని కలిసి ఘోర తపస్సులో వున్న మా తల్లిని రామునికి చూపావా? జరిగినది చెప్పావా అని ప్రశ్నిస్తాడు. దానికి విశ్వామిత్రుడు నేను చేయగలిగినదంతా చేశాను, మీ తండ్రి గౌతముడు కూడా వచ్చాడు. ఇద్దరూ రామ లక్ష్మణులకి అతిథి సత్కారం చేశారు. అహల్యాదేవి గౌతముడ్ని చేరింది అని చెబుతాడు.
Comments
Post a Comment