అసలు కథ
రెణ్ణెల్ల క్రితం, ఓ సాయంత్రం 7:00 గంటలకు:
మీటింగ్ రూమ్, యూనియన్ హోమ్ మినిస్టర్ శ్రీ హర్ జోత్ సింగ్ మాన్ గారి ఆఫీస్, నార్త్ బ్లాక్, సెక్రెటేరియట్, న్యూఢిల్లీ లో ఒక సమావేశం. పెద్ద హాలు, ప్రొజెక్టర్ స్క్రీన్ పైకి రోల్ చేయబడి వుంది. దాని వెనుకగా 10' x 8' సైజులో మాజీ ప్రధాని కీ| శే| శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ గారి (కూర్చుని తన డెస్క్ మీద ఏదో కవిత వ్రాస్తున్న చిత్రం) ఆయిల్ పెంటింగ్ చిత్రీకరించబడి వుంది. దానికి కొంచెం దూరంలో ఎదురుగా పెద్ద టేబుల్ కనీసం 16 నుంచి 20 మంది కూర్చునే విధంగా ఛెయిర్స్ వున్నాయి. గృహమంత్రివర్యులు అటల్జీకి వీరాభిమాని, మరియు ప్రియశిష్యుడు.
హోమ్, రక్షణ, మరియు విదేశాంగ శాఖామాత్యులు, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ చీఫ్ డైరెక్టర్, ఫీల్డ్ ఆపరేషన్స్ డైరెక్టర్, చీఫ్ అనలిస్ట్, రక్షణ మంత్రి ముఖ్య సలహాదారు, నేషనల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (NIA) చీఫ్, మరో ఇద్దరు అతి ముఖ్యమైన ఆఫీసర్స్ మాత్రమే ఈ మీటింగ్ హాజరవుతున్న పెద్దలు. అత్యంత రహస్య సమావేశం ఇది, పాల్గొన్న వారికీ మరికొద్ది మంది అవసరమైన వారికీ తప్ప సమావేశం గురించి ఎవరికీ తెలియదు.
"గురుబక్ష్ సింగ్ సంధు, ఖలిస్తానీ లీడర్ & కెనడా ఆపరేషన్స్ హెడ్ మరియు యూనిస్ మొహమ్మద్ ఖాన్, ఐఎస్ఐ (ఇండియా ఆపరేషన్స్) డైరెక్టర్ కలిసి మొత్తం ప్లాన్ చేశారు సర్" వివరించడం మొదలుపెట్టారు RAW ఫీల్డ్ ఆపరేషన్స్ డైరెక్టర్ విరుద్ధ్ సక్సేనా. కెనడాలోని భారత ప్రధాన రాయబారిని, మరికొందరు డిప్లొమాట్స్ ని హతమార్చడం, దానికి ప్రతీకారంగా దాడులు జరిగినట్టుగా మన దేశంలోని స్వర్ణ దేవాలయం మీద ఎటాక్ చేయడం అనేది ప్లాన్. ఈ ఎటాక్ చేసింది RSS మరియు హిందూ వాదులు అని తమ టూల్ కిట్ ద్వారా గ్లోబల్ గా ప్రచారం చేయడం నెక్స్ట్ స్టెప్. దీనికి కావాల్సిన లాజిస్టిక్స్ అన్నీ పాకిస్తాన్ ఎంబసీ సమకూరుస్తుంది, పూర్తి ఆపరేషన్ కు ఇరాన్ ఆర్ధిక సాయం చేయబోతుందని పక్కా ఆధారాలు వున్నాయి సర్.
ఈ ఆధారాలని బయటపెట్టి వారిని నిలువరించగలమా అని గృహ మంత్రి అడిగారు. "లేదు సర్, స్థానిక ప్రభుత్వం తన రాజకీయ అవసరాలకోసం వారిని వెనకేసుకు వస్తుందని మనకి తెలిసిందే బయటపెట్టి మనం చేయగలిగేది ఏమీ వుండదు" రక్షణ మంత్రి వాస్తవ పరిస్థితిని చెప్పారు. డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటే ఎలా వుంటుంది అన్న ప్రశ్నకి విదేశాంగ మంత్రి బదులిస్తూ "ముందు ఇంట్లోనే వ్యతిరేకత మొదలవుతుంది సర్. బాలాకోట్ దాడి అంతా బూటకం అని గొడవ చేసింది మన ప్రతిపక్షాలే. తమ పార్లమెంటులో స్వయంగా పాకిస్తాన్ ధృవీకరించే వరకు వీళ్ళు ప్రభుత్వం మీద దాడి చేస్తూనే వున్నారు". డైరెక్ట్ యాక్షన్ వీలు కాదు అని తేల్చేశారు. "రా చీఫ్, నేను మొత్తం ప్లాన్ ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాం సర్, ఫూల్ ప్రూఫ్ గా వుంది. విజయవంతంగా పూర్తి చేస్తామన్న నమ్మకం 100% వుంది" అంటూ ఎన్ఐఏ చీఫ్ తన సమ్మతిని తెలియజేసారు.
"పరిస్థితి చేజారిపోకుండా హ్యాండిల్ చేయండి" నర్మగర్భంగా చెబుతూ ఎవరు లీడ్ చేస్తున్నారు అని కుతూహలంగా అడిగారు గృహ మంత్రి. "సీనియర్ అనలిస్ట్ ప్రమోద్ యాదవ్ లీడ్ చేస్తున్నాడు సర్. ఇప్పటికే ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తిచేసిన క్రెడిట్ అతనికి వుంది" సక్సేనా గారు చెప్పారు. మంత్రిగారు లేస్తూ ఆల్ ది బెస్ట్ యంగ్ మాన్, టేక్ కేర్ అఫ్ దిస్ అంటూ ప్రమోద్ తో కరచాలనం చేసి ఛాంబర్ బయటకి వెళ్లిపోయారు.
రెండు వారాల క్రితం:
విన్నీపెగ్, కెనడాలో చల్లటి శీతాకాల సాయంత్రం, ఉష్ణోగ్రత గణనీయంగా మైనస్ లలోకి తగ్గింది. సమీపంలోని ప్రాంతాన్ని మంచు కప్పి, వీధి దీపాల కాంతిలో మెరుస్తూంది. ఆ వీధి చివరలో మిగిలిన ఇళ్ళకి కొంచెం దూరంగా ఓ రెండు అంతస్తుల భవంతి ఉంది. మొదటి అంతస్థు లివింగ్ రూమ్ ఫైర్ ప్లేస్ లో మంటలు చిటపటమంటూ వెలునీ వేడినీ యిస్తున్నాయి. పెద్ద కిటికీల నుంచి వెలుపలి మంచుతో కప్పిన వీధి కనిపిస్తోంది, గోడలపై ఎవరివో ఫామిలీ ఫోటోలు, సర్టిఫికేట్లు, మరియు కొన్ని ఫ్రేమ్ చేసిన అందమైన పెయింటింగ్స్ అలంకరించబడి ఉన్నాయి. లివింగ్ రూమ్ నుండి కనిపించే వంటగదిలో పొయ్యిపైన స్వీట్ పొటాటో సూపు మరుగుతోంది, దాని వాసన అప్పుడే కాల్చిన బ్రెడ్‌తో కలిసి గదినిండా వ్యాపించింది. లివింగ్ రూమ్ మధ్యలో వున్న పెద్ద టేబుల్ పైన ఒక మ్యాప్ ని పరిచి నలుగురు వ్యక్తులు మంద్ర స్వరంలో చర్చించుకుంటున్నారు.
ఆ బిల్డింగ్ కు కొద్దీ దూరంలో పవర్ఫుల్ నైట్ విజన్ బైనాక్యూలర్స్ తో ఈ రెండవూ పాయింట్(సమావేశ స్థలం)ని గమనిస్తున్న ప్రమోద్ "బాయ్స్ మనకున్న సమాచారం ప్రకారం కొద్ది సేపటిలో సంధు తన మనుషులతో వచ్చి వీరికి కావాల్సిన ఆయుధాలు, డబ్బు ఇచ్చి, మాట్లాడి వెళ్ళిపోతాడు. మొత్తం ఓ ఐదు నిమిషాల్లో జరిగిపోవచ్చు. ఈ సమయంలోనే మనం పని కానిచ్చేయాలి" అన్నాడు. ఎస్ సర్ అంటూ మిగిలిన ముగ్గురూ లేచారు. అందరూ కామాఫ్లాజ్ లో వున్నారు, దూరం నుంచి చూస్తే మంచు తప్ప మనుషులు కనబడరు. ప్రతీ ఒక్కరి చేతిలో సెమి ఆటోమాటిక్ వెపన్, సైలెన్సర్ అమర్చిన హ్యాండ్ గన్, ఇంకా వాటికి అదనపు కాట్రిడ్జెస్ వున్నాయి. నలుగురూ నిశ్శబ్దంగా ఆ భవంతిని చేరుకున్నారు. చప్పుడు కాకుండా బిల్డింగ్ లోకి ప్రవేశించిన బృందం మేడ మీదికి చేరుకొని నాలుగు ప్రక్కలా బైనాక్యూలర్స్ లో గమనించడం ప్రారంభించారు.
నిర్మానుష్యంగా వున్న ఆ వీధి చివరనుంచి ఒక హోండా ఒడిస్సీ మినీ వ్యాన్ లోనికొచ్చింది. హెడ్ లైట్స్ అఫ్ చేసి వున్నాయి. నిశ్శబ్దంగా వచ్చి బిల్డింగ్ కి పది మీటర్ల దూరంలో ఆగింది. ఇద్దరు వ్యక్తులు దిగి వెనుక డోర్ నుంచి పెద్ద పెట్టెని క్రిందకి దించి బిల్డింగ్ లోకి మోసుకు పోతున్నారు. వారిని అనుసరిస్తూ మరొక వ్యక్తి వెళ్ళాడు. వాళ్ళొచ్చేలోపు ప్రమోద్ బృందం వేగంగా మొదటి అంతస్తుకి దిగి అక్కడున్న నలుగురినీ కాల్చేశారు. ఈ పెట్టె పట్టుకొస్తున్న ఇద్దరినీ పైకి రానిచ్చి వారినీ కాల్చి చంపేశారు. వాళ్ళు క్రింద పడేలోపు ప్రమోద్ వారిని అనుసరిస్తున్న మూడో వ్యక్తిని గురిపెట్టి షూట్ చేశాడు. చనిపోయిన ముగ్గురి దేహాలు పరిశీలనగా చూశాడు ప్రమోద్. వారిలో సంధు లేడు. అయితే వ్యాన్ లోనే వుండిపోయి వుండాలి లేదా అసలు రాకపోయుండాలి.
అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్న ప్రమోద్ "బాయ్స్ మీరు బయల్దేరండి, సంధు వ్యాన్లో వుంటే నేను వాడిని న్యూట్రలైజ్ చేసి వచ్చేస్తాను" తన నిర్ణయం తెలిపి ఒక్క హ్యాండ్ గన్ తప్ప మిగిలిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలు వారికిచ్చేశాడు.. ఇలాంటి ఆపరేషన్స్ లో చర్చలు వాదులాటలూ వుండవు. మాన్ ఇన్ కమాండ్ ఏం చెబితే అది చేయడమే. సినిమాల్లోలాగా నో సార్ నేను త్యాగం చేస్తాను మీరు వెళ్ళండి అని సవాలు చేయడం జరగదు. ఎస్ సర్, అంటూ వారు సంధు మనుషులు తెచ్చిన పెట్టెని పట్టుకుని బిల్డింగ్ వెనుక వైపునుంచి బయటకు పరుగు తీశారు.. ప్రమోద్ ఆ భవంతి ముందుకి వచ్చి వ్యాన్ వైపు కదిలాడు. నెమ్మదిగా వ్యాన్ని సమీపించి డోర్ ఓపెన్ చేసి చూస్తే.. సంధు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ కనబడ్డాడు. వేరే ఆలోచన లేకుండా వాడిని పాయింట్ బ్లాంక్ లో కాల్చేశాడు.
ఇంకా ఎవరున్నారో వెదకాలని తిరిగేలోపు వెనుకనుండి ఆటోమేటిక్ రైఫిల్ బట్ తో నెత్తి మీద బలంగా దెబ్బపడింది. ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. మొత్తం ఆరుగురు వచ్చారు, ముగ్గురు పెట్టెతో బిల్డింగ్ లోకి వెళ్లగా సంధుతో బాటు ఇంకో ఇద్దరు వ్యాన్ లోనే వున్నారు. సంధు ముఖ్యమైన ఫోన్ మాట్లాడుతున్నాడని మిగిలిన ఇద్దరూ వ్యాన్ బయట రెండో పక్క నిలబడి వున్నారు. కాల్చిన శబ్దం వినబడి ప్రమోద్ మీద దాడి చేశారు.
ఆ ఇద్దరు వ్యక్తులు ప్రమోద్ ని వాన్ లో తమతో బాటు తీసుకు పోయారు, దీన్ని గమనించిన ప్రమోద్ బృందం, నడి రోడ్లో వారిమీద అటాక్ చేస్తే చుట్టుపక్కల వారి దృష్టిని ఆకర్షించే ప్రమాదం వుందని గ్రహించి బ్యాక్ అప్ కోసం సమాచారం అందించి,వారిని ఫాలో అవసాగారు. రెండు గంటల తర్వాత ప్రమోద్ ని బంధించిన ప్రదేశానికి కొద్ధి దూరంలో బ్యాక్ అప్ టీం వీరిని కలిసింది. అందరూ కలిసి దాడి చేసి ప్రమోద్ ని రక్షించారు. తనని విచారణ చేసే సమయంలో ప్రమోద్ అమెరికన్ సీఐఏ (CIA) కూడా వీరి వెనుక వున్న విషయాన్ని గమనించాడు. మిగిలిన సందర్భాల్లోలాగానే దీనిని కూడా నిలబెట్టి ప్రశ్నించే అవకాశం లేదు.
ప్రస్తుతానికి వస్తే:
"వాళ్ళని చంపేసి ఆయుధాల బాక్స్ ని చేజిక్కుంచుకోగానే వచ్చేస్తే పట్టుబడేవాడు కాదుగా ?" రచన అనుమానం. "మిషన్ వుద్దేశం ఆయుధాలు పట్టుకోవడం కాదు, గురుబక్ష్ సింగ్ సంధుని న్యూట్రలైజ్ చేయడం" మోహన్ గోఖలే గారు సమాధానం చెప్పారు (నేను ముందు పరిచయం చేసిన రావు రమేష్ ఈయనే). ఎస్, నాకు జ్ఞాపక శక్తి తిరిగి వచ్చింది. ఫ్రాక్చర్స్ తగ్గడానికి నాలుగు వారాలు పడుతుందని డాక్టర్ గారు చెప్పారు.
డిఫెన్స్ మినిస్టర్ లైన్లో వున్నారు అంటూ గోఖలేగారు ఫోన్ నాకు ఇచ్చారు. గుడ్ మార్నింగ్ సర్ అన్నాను. "ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేసినందుకు కంగ్రాట్యులేషన్స్ మిస్టర్ ప్రమోద్, ఎలా వున్నారు? మీరు మనందరికీ గర్వ కారణం అని హోమ్ మినిష్టర్ గారు తమ శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. త్వరగా కోలుకుని మీరు పూర్తి ఆరోగ్యం పొందాలని కోరుకుంటున్నాను" అని రక్షణ మంత్రిగారు పెట్టేశారు.
"నాకు రేపు కూడా లీవ్ కావాలి నాన్నా, ఎల్లుండి రిపోర్ట్ చేస్తాను" అని మోహన్ గారిని అడిగింది రచన. ఆమె గోఖలేగారి ముద్దుల కూతురు రచన గోఖలే, నా ఒక్కగానొక్క భార్యామణి. తను రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ లో డేటా అనలిస్ట్. తనది డెస్క్ జాబ్, నాది ఫీల్డ్ జాబ్. మామూలుగా ఆఫీస్ రొమాన్స్ ఒప్పుకోరు కానీ మాది స్పెషల్ కేస్. తనది ఆల్మోస్ట్ 9 టూ 5 జాబ్. పూర్తిగా టెక్నికల్ వర్క్ మాత్రమే వుంటుంది. ఎస్పియొనేజ్ (గూఢచర్యం), ఫీల్డ్ ఆపరేషన్స్ వంటి వాటికి ఏమాత్రం సంబంధం వుండదు. ఏమైనా వుంటే ఇందాక బాక్స్ దొరగ్గానే వచ్చేస్తే లాంటి ప్రశ్నలు వేయదు.
ఈ అమ్మాయి భలే బావుంది:
రెండు రోజుల తర్వాత ఓ సాయంత్రం.. "ఇంటరాగేషన్ రికార్డింగ్స్ తో సహా మొత్తం బ్రీఫింగ్ విన్నాం.. అంత బాధలోనూ ఈ అమ్మాయి భలే బావుంది అని నాలుగు సార్లు అన్నావ్, మగబుద్ది..", రచన మేడం ఫిర్యాదు. నేను చిన్నగా నవ్వుతూ "నాలుగు కాదు మూడు సార్లే.." అన్నాను. సాలోచనగా నన్ను చూస్తూ మరోసారి నెమరు వేసుకుని "నిజమే మొదటి సారి 'ట్రూ లైస్' కథ తర్వాత, రెండో సారి 'లియో' చెప్పాక, మూడో సారి నన్ను చూశాక (కొంచెం గర్వం వినబడింది) కదా?" అడిగింది. తలూపాను.
ఏదో స్ఫురించినట్టుంది, "అవునూ మేము ఆ రికార్డింగ్స్ విన్నప్పుడు నువ్వు లేవు, నాకు తెలిసి నువ్వు ఇంకా వినలేదు, ఏం మాట్లాడావో నీకెలా తెలిసింది?" అనుమానంగా అడిగింది. అది ట్రేడ్ సీక్రెట్ చిట్టీ చెప్పకూడదు అన్నా.. 'హ్మ్మ్' బుంగమూతి పెట్టుకుని లేచిపోయింది.
నిజం చెప్పాల్సిన టైమ్ వచ్చేసింది. "రచనా ఇలా కూర్చో నీకో విషయం చెప్పాలి" అన్నాను. "ఏంటది చెప్పూ.." గారంగా అంటూ వచ్చి వళ్ళో కూర్చుంది. మీకు చెప్పిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో బాట్స్ కథలో ఒక చిన్న ట్విస్టు వుంది. వాళ్ళు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎవరినీ పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకోలేదు, ఆ అవకాశం యివ్వరు. కేవలం సూచనలు మాత్రమే ఇస్తుంది. వాటిని ఎలా వాడుకోవాలో ఆ ఏజెంటు ఇష్టం. అంటే.ఆ కథలు ఏఐ నాకు చెబితే వాటిని సమయానికి అనుకూలంగా నేను వాళ్లకి చెప్పాను.
మరి జ్ఞాపక శక్తి పోవడం..? సందేహంగా అడిగింది. "అదైతే కొంత నిజమే పూర్వం జరిగిన విషయాలు తాత్కాలికంగా మర్చిపోతాం. కానీ అపాయంలో వున్నాం తప్పించుకోవాలి అనేది మాత్రం తెలుస్తూ వుంటుంది" అన్నాను. మరి నాన్న ఎందుకు ఆలా చెప్పారు? ఇంకా సందేహం పోలేదు. వాళ్ళ నాన్నకి తెలీకుండా ఉండదు అనే నమ్మకం.
మీ నాన్న లాజిస్టిక్స్ డైరెక్టర్, ఆయనకి ఫీల్డ్ ఆపరేషన్స్ తో ప్రత్యక్ష సంబంధం వుండదు. పైగా ఈ విషయం తెలిస్తే ఆపరేషన్ విజయావకాశాల మీద పూర్తి నమ్మకంతో వుండలేరు, అందుకే ఫీల్డ్ ఎగ్జిక్యూషన్ తప్ప మిగిలిన డిపార్ట్మెంట్స్ వాళ్లకి అలాగే చెబుతారు. మీ నాన్నకి అస్సలు చెప్పరు, కూతురి జీవితం ఏమైపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. "అయితే ఇప్పుడు నాకెందుకు చెప్పావు?" కొంచెం కోపంగా చూస్తూ సీరియస్ గా అడిగింది.
"మంచి ప్రశ్న, నీ దగ్గర ఏమైనా దాచానా బేబీ?" ఇంకా కోపంగానే వుంది. "సరే విను, పూర్తిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అధీనం లోకి పోయి తిరిగి రాకపోతే వాళ్ళ జీవితాలు ఏమవ్వాలి" అని ఈ కేసుని దగ్గరగా పరిశీలిస్తున్న హోమ్ శాఖ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేయడం వల్ల వారి మనోభావాలు లెక్కలోకి తీసుకుని అసలు విషయాన్ని సమీప బంధువులకి అంటే కేవలం తమ భార్య/భర్త/పార్టనర్ పెళ్లికాని వారుంటే తల్లి/తండ్రి లకు మాత్రమే చెప్పమని డైరెక్షన్స్ వచ్చాయి. ఈ విషయం మీ నాన్నకి చెప్పకు."
నాక్ నాక్ .. "ప్రమోద్ మై బాయ్" అంటూ తలుపు కొట్టారు గోఖలే గారు. గబుక్కున ఒళ్ళోంచి లేచి వెళ్లి తలుపు తీసింది ఆయన కూతురు, విని వుంటారా, ఆ గుంభనమైన నవ్వు చూస్తుంటే వినేసినట్టే వుంది. చెప్పండి సర్ అన్నాను..
"ఈ నాలుగు వారాల్లో కొరియన్ భాష నేర్చుకోవాలోయ్, నెక్స్ట్ ఆసైన్ మెంట్ కొరియాలో.. "
సమాప్తం.



Comments
Post a Comment