ఈ ఏడాది మొదట్లో వచ్చిన పుష్ప2 టీజర్ గుర్తుందా? దానికీ ఇప్పుడొచ్చిన సినిమాకీ సంబంధమే లేదు కదా? తెర వెనుక ఏం జరిగింది? ఇది అక్కడక్కడా వినబడిన దాన్ని బట్టి, సోషల్ మీడియాలో చూస్తున్న దాన్ని బట్టి వచ్చిన ఒక అంచనా మాత్రమే.
నిజానికి ఆ టీజర్లో వున్న కథని సినిమాగా ఎప్పుడో తీసేశారు. రిలీజ్ అవ్వాల్సిన సమయంలో అల్లు వారబ్బాయి తన భార్య స్నేహితురాలి భర్త కోసం ప్రచారానికి వెళ్లడం, ఒక పార్టీ వారు అసహనం వ్యక్తం చేయడం, ఆ అభిమానులు గట్టిగానే ట్రోల్ చేయడం తెలిసిన విషయమే. పుండు మీద కారంలా ఆ ఫ్రెండ్, అతని పార్టీ ఘోరంగా ఓడిపోవడం కూడా తెలిసిన విషయమే. ఈ ట్రోలింగ్ నేపథ్యంలో భార్య తరపు వారి మాటలు వినడం వల్ల ఇదంతా అవుతుంది అని కొందరు నెటిజన్లు బాహాటంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తనకి నచ్చిన వారికి సపోర్ట్ చేసుకునే హక్కు తనకుంది అని బలంగా విశ్వసించిన బన్నీ బాబు తన కారణంగా బంధువులు, మిత్రులు మాటలు పడడం సహించలేకపోయాడు. ఎంతటి గొప్పోడైన పెళ్ళాం మాట వినాలిసిందే అనే సందేశం ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఇది మెచ్చుకోవాల్సిన విషయం, నేషనల్ అవార్డు విన్నర్, పాన్ ఇండియా ఐకాన్ చెబితే బాగా నాటుకుపోతుంది.
వెంటనే తన స్నేహితుడు, శ్రేయోభిలాషి, మెంటర్, ఈ సినిమా దర్శకుడు అయినా సుకుమార్ ని పిలిచి తన సంకల్పాన్ని తెలియజేశాడు. సరే ఈ విషయం బలంగా వెళ్లేలా పుష్ప-3 చేద్దాం అని సుకుమార్ ప్రామిస్ చేశాడు. సంతృప్తి చెందని బన్నీ 'పుష్ప 3 వచ్చేసరికి ఇంకో ఆరేడేళ్లు పడుతుంది అప్పటికి అందరూ మర్చిపోతారు, సందేశం పలచబడిపోతుంది' అని ఆవేదన చెందాడు. తన ప్రాణ స్నేహితుడి ఆవేదన అర్ధం చేసుకున్న సుకుమార్ ఇప్పటికే తీసేసిన సినిమాని పుష్ప-3 గా మార్చి కొత్త కథని షూట్ చేసేసి పుష్ప-2 గా విడుదల చేశాడు.
సందేశం అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఎవరికైనా అనుమానం ఉందేమో అని సాక్షి టీవిలో తన మనుషులని పంపి మరీ సినిమాలో లేని డైలాగులని ప్రచారం చేయిస్తున్నారు. మైత్రి వారు జనాంతికంగా వార్నింగులైతే ఇచ్చారు కానీ సాక్షిని దాని యజమానినీ అడిగే ధైర్యం చేయరు. సినిమా రిజల్ట్ కూడా ఎక్స్ పెక్ట్ చేసినదే..
ఈ నేపథ్యంలో పుష్ప-3 వుండదు అని గిట్టని వారు చేస్తున్న ప్రచారం నమ్మి బాధలో వున్న ప్రేక్షకులకి ఊరటనిచ్చే సంతోషకరమైన వార్త ఏంటంటే.. పుష్ప-3 ఆల్రెడీ తీసేశారు, కొన్నాళ్లలో రిలీజ్ చేస్తారు అని అభిమానులు చెబుతున్నారని వినికిడి. నిజమైతే హ్యాపీనే. 🤗
Comments
Post a Comment