స్వింగ్ డోర్ ఓపెన్ చేసుకుంటూ నర్స్ వచ్చింది, మెలకువగా వున్న నన్ను చూస్తూ ఎలావుందీ అని అడిగింది. నా సమాధానం కోసం చూడకుండా చేయి పట్టుకుని పల్స్ చెక్ చేసి, స్టాండ్ మీద వున్న ఇంజక్షన్ తీసి చేసేసింది. డాక్టర్ రౌండ్స్ లో వున్నారు, ఓ పదినిమిషాల్లో వచ్చి చూస్తారు అని చెప్పి వెళ్ళిపోయింది.
చాలా సేపటికి డాక్టర్ వచ్చారు, వెనుకే ఓ అమ్మాయి వచ్చింది. "ఈ అమ్మాయి భలే బావుంది" పైకే అనేశాను. డాక్టరు గట్టిగా నవ్వి కేసు షీట్ చూస్తూ "యు అర్ ఇన్ ఏ బెటర్ కండిషన్ నౌ" అని ఆ అమ్మాయిని నన్ను వదిలేసి వెళ్లిపోయారు. ఇంతసేపూ కళ్ళనిండా నీళ్లతో నన్నే చూస్తూ నిలబడ్డ ఆ అమ్మాయి డాక్టర్ వెళ్ళిపోగానే ఒక్క ఉదుటున దగ్గరికి వచ్చి నన్ను చుట్టేసింది.
"అమ్మా" ప్రక్కటెముకలు కళుక్కుమన్నాయి.
"అయ్యయ్యో, సారీ సారీ నొప్పిగా వుందా" అని అడుగుతూ కొంచెం దూరం జరిగింది కానీ నన్ను వదలలేదు. మౌనంగా కన్నీళ్లు కారుస్తూ అలానే వుండిపోయింది. చిన్నగా వెక్కి పడుతుంది.
"ఇతని మెమొరీ ఎందుకు పోయింది, వాళ్ళు పెట్టిన చిత్రహింసలకా?" బ్యూరోక్రాట్ లాగా కనబడుతున్నతని ఎంక్వయిరీ.
"ఇది హై ఎండ్ టెక్నాలజీ సర్, అడ్వాన్సుడ్ నానో టెక్నాలజీ కపుల్డ్ విత్ జెనెరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్[2], నానో టెక్నాలజీని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో కలిపి తయారు చేశారు" రావు రమేష్ (పెద్దాయన) గారి సమాధానం. "ఫీల్డ్ వర్క్ లో వుండగా మన ఏజెంట్స్ దొరికిపోతే వారినుంచి రహస్యాలు రాబట్టడం కోసం టార్చర్ చేయడం సహజం. ఈ టార్చర్ ఒక లెవల్ దాటాక వాళ్లకి జ్ఞాపకశక్తి తాత్కాలికంగా పోయి కృత్రిమ మేధ (Artificial Intelligence / AI) యాక్టివేట్ అవుతుంది. ఇక్కడనుంచీ AI ఆ ఏజెంట్ ని నడిపిస్తుంది. అంటే, వాళ్ళ ఇంటర్రాగేషన్ కి ప్రతిస్పందించేది AI మాత్రమే"
"ఇంటరెస్టింగ్, ఇది ఏ దేశపు టెక్నాలజీ?" బ్యూరోక్రాట్ బాబు సందేహం.
"పూర్తిగా మేక్ ఇన్ ఇండియా సర్, డీ.ఆర్.డీ.ఓ., ముంబయి ఐఐటీ వాళ్ళు కలిసి డెవలప్ చేసిన టెక్నాలజీ ఇది. ప్రపంచంలో వేరెవరికీ లేదు. వున్నా ఇంత అడ్వాంస్డ్ వుండదు"
"AIని ఒక మనిషిలో ఎలా పెట్టారు? చిప్ ఇంప్లాంట్ చేశారా? పట్టుకున్న వాళ్ళు స్కాన్ చేస్తే తెలిసిపోతుందిగా?" సర్కారీ బాబు డౌట్.
"ఇందాక నానో టెక్నాలజీ అన్నాను విన్నారా?" రావు రమేష్ గారు చెప్పసాగారు. "మామూలు కంటికి కనబడని నానో బాట్స్[1] AI ని రన్ చేస్తాయి. వాటిని ఏజెంట్స్ బాడీలో ఇంజెక్ట్ చేస్తాం. ఏ స్కానింగ్ కీ దొరకవు."
"నానో బాట్స్ అంటే..?"
"మామూలు కంటికి కనబడని అతి సూక్ష్మమైన రోబోట్లు. సాధారణ రక్తకణం కంటే పది రెట్లు చిన్నగా వుంటాయి. ఇప్పుడిప్పుడే మెడికల్ ఫీల్డ్ లో వాడుతున్నారు. ఇవి మనిషి శరీరంలోని కాన్సర్ సెల్స్ ని ముందుగా కనిపెట్టి సమాచారం ఇవ్వడం, ఆ సెల్స్ ని నిర్వీర్యం చేయడం లాంటివి చేస్తాయి. మన శాస్త్రజ్ఞులు వీటిని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో అనుసంధానం చేసి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మన డిఫెన్స్ విభాగాలకు మాత్రమే ఈ టెక్నాలజీని పరిమితం చేశారు. ఇది బాగా ఖర్చుతో కూడినది. ప్రస్తుతం డిఫెన్స్ లైన్ లో బాగా టాప్ ఏజెన్సీలు, అందులోనూ ముఖ్యమైన ఏజెంట్లకు మాత్రమే వాడుతున్నాం. అదీ ట్రయల్ బేసిస్ మీద" రావుగారు ఓపిగ్గా వివరించారు.
"అద్భుతం సర్, దాని కంట్రోల్ మీదగ్గరే వుంటుందా?" సర్కారీ బాబు (బ్యూరోక్రాట్) సినిమాల్లో చూపించినట్టు కాదు, చాలా తెలివిగా వున్నాడు.
"లేదు సర్, బయటనుంచి కంట్రోల్ ఏమీ వుండదు. అతని శరీరంలో వేరేగా వుండే ట్రాకింగ్ వ్యవస్థ వల్ల ఎక్కడున్నాడో కనిపెట్టి రక్షించుకుంటాం. వీళ్ళు మళ్ళీ బేస్ కి వచ్చినప్పుడు ఆ సిస్టంకి కనెక్ట్ అయ్యి ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. ఇందాక మనం చూసినట్టు". బాబు ఈ వివరణతో సంతృప్తి చెందినట్టున్నాడు, ఇంకేం ప్రశ్నలు వేయలేదు.
"రచనా, జాగ్రత్తగా చూసుకో . డిశ్చార్జ్ చేసే సమయానికి నేను మళ్ళీ వస్తాను. బీ అలర్ట్ బాయ్స్" అందరికీ ఆదేశాలు ఇచ్చేసి పదండి సర్ అంటూ బ్యూరోక్రాట్ గారిని తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు.
అంతా ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నట్టున్నారు. కాసేపటికి.. "ఇందాకటినుంచీ ఒకటి కొట్టేస్తుంది అడగనా?" వీళ్ళలో కుర్రాడిలా వున్న ఓ చిక్నా ఏజెంటు, ఏంటీ అన్నట్టుగా మొహం పెట్టిన మిగిలిన వారి వైపు చూస్తూ.. "మొదటిది 'ట్రూ లైస్', రెండోది 'లియో' లేదా ఆ ఇంగ్లీష్ మూవీ.. మరి ఆ మూడోది ఏమిటి? ఈ రాజు, గంగారాంలు ఎవరు? అసలు ఆ అస్సాం స్టోరీ ఎందుకు చెబుతున్నాడు?"
"నాక్కుడా తెలీదు, భాస్కర్ భయ్యాకే తెలియాలి" తల అడ్డంగా ఊపుతూ అంది రచన.
సదరు భాస్కర్ చిన్నగా నవ్వుతూ "షాడో" అన్నాడు. "ఒకప్పుడు తెలుగులో పాకెట్ సైజు డిటెక్టివ్ బుక్స్ వచ్చేవి వాటిలో మధుబాబు అనే ప్రముఖ రచయిత రాసిన షాడో నవలలు బాగా ఫేమస్. వాటిలో పాత్రలే ఈ రాజు అనబడే షాడో, అతని మిత్రుడు గంగారాం " చెప్పాడు.
ఇందాకటినుంచీ నేను ఒకడిని అక్కడ వున్నానని గ్రహించనట్టుగా వీళ్ళందరూ మాట్లాడిన దాని సారాంశం నేనొక సీక్రెట్ ఆర్గనైజషన్ ఏజెంటుని, ఎదో ఆపరేషన్లో వుండగా పట్టుబడ్డాను. నన్ను ఇంటర్రాగేట్ చేస్తుండగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నా జ్ఞాపక శక్తిని టేక్ ఓవర్ చేసింది. బహుశా కొన్ని రోజుల్లో నా జ్ఞాపక శక్తి తిరిగి వస్తుంది. ఈ అందమైన అమ్మాయి రచనకి నేను కావల్సిన వాడిని. బాయ్ ఫ్రెండ్ లేదా భర్త అయ్యుండొచ్చు. "నువ్వెంత లక్కీనో నీకర్ధం కావడం లేదురా అబ్బాయ్", అనుకోకుండానే పైకి అనేశాను. మగాళ్ళిద్దరూ పెద్దగా నవ్వుతూ నావైపు చూశారు. రచన నవ్వు దాచుకుని సిగ్గుపడుతూ మొహం అటువేపుకి తిప్పుకుంది.
ముగ్గురూ బాగా పరిచయస్తులనుకుంటా.. వాళ్లిద్దరూ రచనని టీజ్ చేయడం మొదలెట్టారు. రచన వాళ్ళని బెదిరిస్తోంది. నాకేమీ జ్ఞాపకం లేదన్న విషయం గ్రహించ బట్టేమో వాళ్ళెవరూ నాతో డైరెక్టుగా ఏమీ మాట్లాడడం లేదు. కాసేపటికి నేను నిద్రలోకి జారుకున్నాను.
అసలు ఏం జరిగింది? త్వరలో..
1. Nanobots: https://www.youtube.com/watch?v=Na_j0BA55ZE
Comments
Post a Comment