విచారణ - Interrogation (take 2)

Take 2 

లమీద ఎవరో సమ్మెట దెబ్బలు వేస్తున్నట్టు పగిలిపోతున్నంత బాధ, కళ్ళల్లో సూదులతో గుచ్చినట్టు మంట.. హ్యాంగోవరా? కళ్ళు తెరిచినా మసగ్గానే వుంది ఏమీ కనబడడం లేదు. కొంచెం సేపటికి మసక తగ్గి కొద్దిగా కనబడుతుంది, నెమ్మదిగా స్పృహ వస్తుంది. నేనొక కుర్చీలో రెక్కలు వెనక్కి విరిచి కట్టేయబడి వున్నాను.

"గుడ్, స్పృహలోకి వచ్చాడు మళ్ళీ మొదలుపెడదాం" అంటూ వినబడితే తలతిప్పి చూశాను. కొంచెం పొట్టిగా సన్నగా వున్న ఓ వ్యక్తి ముందుకు వంగి నా మొహంలోకి చూస్తూ మాట్లాడుతున్నాడు. ఎవరితను, మళ్ళీ మొదలు పెట్టడం ఏంటి? నా ముందు ఒక టేబుల్ వుంది, దానిమీద కొన్ని ఇంజెక్షన్స్, దూది, ఒక గ్లాసులో కొంచెం నీళ్లు వున్నాయి. ఆ గదిలో టేబుల్ కి కొంచెం దూరంగా ఇద్దరు వస్తాదుల్లా వున్న వ్యక్తులు నిలబడి నన్నే చూస్తున్నారు.

"ఇది ఇందాకటిదానికన్నా పవర్ ఫుల్, రియాక్షన్ వచ్చి బ్రెయిన్ హేమరేజ్ వచ్చే అవకాశాలు కూడా వుంటాయి, కొంచెం జాగ్రత్తగా వుండాలి మనం" అంటూ ఓ ఇంజక్షన్ తెచ్చి నాకు చేయబోయాడు, నేను ప్రతిఘటిద్దామన్నా శరీరం కదలట్లేదు. నిస్సహాయంగా చేయించుకున్నాను. ఏమీ మాట్లాడకుండా అందరూ నన్నే చూస్తున్నారు. ఇందాకటికంటే వొళ్ళు నొప్పులు, కళ్ళ మంటలు తగ్గాయి. ఇంజక్షన్ పని చేస్తుందా, ఇంటరాగేషన్ అయితే మత్తు లేదేంటి, ఇంకోటి చేస్తాడా ఇలా ఆలోచిస్తున్నాను.

"చెప్పు ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు? నీవెనుక ఎవరున్నారు?" మృదువుగా అడిగాడు. 

"నా పేరు వరదరాజన్, లఢక్ లో సెటిల్ అయ్యాను" చెప్పడం మొదలుపెట్టాను. మాకో కాఫీ షాప్ వుంది. నా భార్య స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది. మా పాప 3వ క్లాసు చదువుతుంది. ఒక రోజు మా షాపులోకి ఎవరో కొందరు వ్యక్తులు వచ్చారు, కాఫీ తాగి వెళ్ళిపోతూ షాపుకి వచ్చిన ఒక అమ్మాయిని చూసి వెకిలిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. నేను సర్ది చెప్పి పంపుదాం అని ప్రయత్నిస్తుంటే నా మీద దాడి చేశారు. ఆ పెనుగులాటలో వారిలో ఒకతను ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఈ లోపులో పోలీసులు వచ్చి మిగిలిన వారిని అరెస్టు చేసి నా దగ్గర స్టేట్మెంట్ తీసుకుని పంపేశారు.

ఇది జరిగిన కొన్ని రోజులకి కొందరు అనుమానాస్పద వ్యక్తులు మా ఇంటి చుట్టూ, షాపు చుట్టూ కనబడడం మొదలైంది. ఇంట్లో భార్య పిల్లలూ, షాపులో పనిచేసే వారూ భయపడడం నేను పోలీసులని సెక్యూరిటీ కోరడం జరిగింది. ఒకరోజు ఒక పెద్దతను ఇంటికి వచ్చి నేను తన కొడుకునని తన మనవరాలిని (మా పాపని) చూడడానికి వచ్చానని చెప్పాడు. మీరు పొరబడ్డారు, నేను మీ కొడుకుని కాదు అని సర్ది చెప్పి పంపేశాను. అయితే, బయటకి వెళుతూ రేపు తనతో సేలంకి రాకపోతే నా భార్యని కూతురిని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నా భార్య నన్ను నిలదీసింది, నాకు నిజంగా అతనెవరో తెలియదు, పోలీసులకి చెబుదాం అని ఓదార్చాను... 

"హిస్టరీ అఫ్ వయోలెన్స్" నా మాటలకి అడ్డొస్తూ అన్నాడు బక్క వ్యక్తి. ప్రశ్నార్ధకంగా చూస్తున్న నాతో "ఇది పాప్యులర్ ఇంగ్లీష్ సినిమా, ఆ కధ చెబుతున్నావు నువ్వు" అన్నాడు అసహనంగా. "ఇంత హై డోస్ ఇంజక్షన్ ఇచ్చాక కూడా సినిమా కథలు ఎలా చెబుతున్నాడు" అడిగాడు అక్కడ నిలబడ్డ ఎద్దు బాబులని. "సార్ అది లియో సినిమా.. " సన్నగా గొణిగాడు ఒక వస్తాదు. ఏంటీ అని గద్దించడంతో, మొన్నొచ్చిన తమిళ సినిమా సార్ అది, ఇంకా పెద్ద హిట్టు అన్నాడు. తమిళ యాస తెలుస్తుంది.

చిన్నగా నవ్విన శబ్దం, రూముకి రెండో వైపు ఆ నవ్వు తాలూకు ఓనర్ చేత్తో నోరు మూసుకుని నవ్వాపుకుంటుంది. "ఈ అమ్మాయి భలే బావుంది" తెలీకుండానే పైకి అనేశాను. కోప్పడతాడేమో అనుకున్న బక్క పలుచని వ్యక్తి నన్ను చూసి తలపట్టుకుని సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నాడు. చాలాసేపు నన్ను పట్టించుకోకుండా వాళ్లలో వాళ్ళే తర్జనభర్జనలు పడసాగారు. నా పరిస్థితి నాకు తెలియడం లేదు, ఎవరు వీళ్ళు, నన్నెందుకు తెచ్చారు, నానుండి ఏం ఆశిస్తున్నారు. ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదు. నేను గమనించింది ఏంటంటే ఏ ఆలోచనా స్థిరంగా వుండడం లేదు. దృష్టి కూడా ఒక చోట నిలపలేకపోతున్నాను.

కాసేపటికి "వెల్, ఆఖరి ప్రయత్నం చేద్దాం. దీనిక్కూడా ఫలితం రాకపోతే మనం నిజంగానే ఓ పిచ్చోడిని పట్టుకున్నాం అని కంఫర్మ్ అయిపోతుంది. చంపేసి పోదాం" అన్నాడు. విచిత్రంగా ఈ మాటలు వేరే ఎవరినో వుద్దేశించి అన్నట్టు నాకేం భయం వేయడం లేదు. పైగా ఆ సంగతి నాకు తెలుస్తుంది. చావంటే భయం పోయిందా? నాకేం అవుతుంది? ఇలా ఆలోచనా సరళి కొనసాగుతూ వుండగానే టక్కున ఇంకో ఇంజక్షన్ చేసేశాడు. ఒక్క సారిగా శరీరంలోని నరాలన్నీ ఉత్తేజితం అయినట్టు ప్రతీ నరంలో రక్తం పారుతున్నట్టు తెలుస్తుంది. మెదడు చురుగ్గా అనిపించసాగింది. పెదవినుంచి రక్తం కారడం తెలుస్తుంది, ఎప్పుడు తగిలింది?

"చెప్పు ఎవరు నువ్వు, ఏం చేస్తూ వుంటావు" అని అడిగాడు.

Retake:

నేనొక గజదొంగను, అసంకల్పితంగా చెప్పడం మొదలుపెట్టాను. నా పేరు రాజు, నేనూ నా మిత్రుడు గంగారాం కలిసి అస్సాం లోని పెద్దమనుషులని దోచుకుని కొంత మా అవసరాలకి వుంచుకుని మిగిలింది పేదలకి పంచి పెడుతూ వుంటాం అన్నాను.

"సరే ఇక్కడేం చేస్తున్నావు" అన్నాడు అనుమానంగా చూస్తూ. "ఒక అంతర్జాతీయ ముఠా వజ్రాలు స్మగ్గ్లింగ్ చేస్తున్నారని సమాచారం తెలిసింది. వారిని దోచుకోవడానికి సిల్చర్ నుంచి ముంబయి సిటీ వచ్చాము, ఇంతలో మీరు పట్టుకున్నారు. గంగారాం ఎక్కడున్నాడు" అనడిగాను.

"రేయ్, నువ్వున్నది ముంబైలో కాదు కెనడాలో. ఇక్కడేం చేస్తున్నావు అంటే ఏవో కధలు చెబుతున్నావు" కోపం పట్టలేక చెంపమీద ఒక్కటిచ్చాడు. పెదవి మీద ఎండిన గాయం మళ్ళీ చిట్లి రక్తం కారసాగింది. "కెనడాలో ఏం చేస్తున్నాను, నన్నెవరు తీసుకొచ్చారు" ఆలోచిస్తూ పైకే అన్నాను.

ఇంతలో గది బయట చిన్నగా ప్రేలుడు శబ్దం వినబడింది, బాంబు అనుకుంటా. ఆ వెనుకే తుపాకుల మోత. ఈసారి పేలుడుకి గదికున్న తలుపు వూడి పడిపోయింది, ప్లెయిన్ క్లోత్స్ లో వున్న కొందరు ఒక్కసారిగా విరుచుకు పడి ఆ గదిలో వున్న వారిని బందించేశారు..

నాకు నెమ్మదిగా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. బతికే వున్నాడా అని అని ఎవరో అడగడం వినిపిస్తుండగా స్పృహ కోల్పోయాను. 


Take 3 త్వరలో.. 

Comments