విచారణ - Interrogation (take 1)

Take 1


ఛెళ్ళ్ మంటూ శబ్దం వినబడింది, సూదులతో గుచ్చినట్టు చెంపంతా మంట, తడిగా జిగటగా పెదవి నుంచి కారుతున్నట్టు తెలుస్తుండగా నొప్పికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచాను. దెబ్బకి పెదవి చిట్లి రక్తం కారుతుంది. కళ్ళు బరువుగా వున్నాయి, తల పగిలిపోతుంది, గొంతెండిపోయింది. కొంచెం నీళ్లు కావాలి. 

"మళ్ళీ మొదలు పెడదాం, ఎవరు నువ్వు 'వినిపెగ్'లో ఏం చేస్తున్నావ్?" కర్కశంగా అడిగాడు. సన్నగా చిన్నగా వున్నాడు, కానీ వెనుక బౌన్సర్ల లాగా ఇద్దరున్నారు.

"మీరెవరు, నేనెక్కడ వున్నాను?" కొద్దిగా స్పృహ వస్తుండగా నీరసంగా అడిగాను. కుర్చీలో కూర్చోబెట్టి రెక్కలు వెనక్కి విరిచి కట్టేశారు. అసలు ఎవరు వీళ్ళు? నన్నెందుకు కట్టేశారు?

"ఇలా లాభం లేదు" అంటూ ఆ బౌన్సర్లు ఇద్దరూ విరుచుకు పడ్డారు. ఓ ఐదు నిముషాలపాటు భీకరంగా కొట్టారు. నేను గట్టిగా అరుస్తున్నాను. నన్ను కొట్టకండి, వదిలేయండి అని వేడుకుంటున్నాను. లాభం లేకపోయింది.

"స్టాప్ ఇట్" అన్నాడు ఆ సన్నని చిన్నని మనిషి విసుక్కుంటూ. "సైంటిఫిక్ పద్ధతులు వుండగా ఈ మొరటు హింసలు ఎందుకు" అనడుగుతూ ఒక ఇంజక్షన్ తీసి నాకు చేసేశాడు. నెమ్మదిగా మత్తు ఆవరించింది నొప్పి తెలియడం లేదు. ఎందుకో కారణం తెలియకపోయినా హాయిగా సంతోషంగా వుంది. 

"ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?" మృదువుగా అడిగాడు. బాగా కావాల్సిన బంధువు లేక మిత్రుడు ఎన్నో ఏళ్ళకి కనబడి క్షేమ సమాచారం అడిగినట్టు అనిపించింది, నాకు తెలియకుండానే చెప్పేయడం మొదలు పెట్టాను.

నా పేరు రాజీవ్ భాటియా. భటిండా మాది, నేను కార్పెట్స్, షాల్స్, తయారు చేసే పెద్ద కంపనీలో మిడిల్ ఈస్ట్ డివిజన్ మొత్తానికి మార్కెటింగ్ హెడ్ ను. నా భార్య శీతల్, నోయిడా లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్చార్ మేనేజర్. మాకో పాప వుంది, పూజ భాటియా, 8th క్లాస్ చదువుతుంది. నా జాబ్ నిమిత్తం నేను ఈజిప్టు, సౌదీ, ఇరాన్, లెబనాన్, కతర్, యిలా అన్ని దేశాలు తిరుగుతూ వుంటాను.

ఒక అనుకోని సంఘటన వల్ల ఓ భయంకరమైన నిజం బయటపడింది. ఎవడో తానొక సీక్రెట్ ఏజెంటుని అని నమ్మించి, దేశ రక్షణ కోసం కొందరు ఇంటి దొంగలని పట్టుకోవడానికి సాయం చేయమని నా భార్యని ఒప్పించాడు. ఈమె కూడా దేశం కోసం, ధర్మం కోసం అని నమ్మేసి వాడి ట్రాప్లో పడిపోతుంది అని తెలిసింది. మేం ఇన్వెస్టిగేట్ చేస్తే వాడొక సెకండ్ హ్యాండ్ కార్ల సేల్స్ మాన్, నా భార్యని గోకుతున్నాడు అన్న విషయం తెలిసింది. ఆమెని కాపాడడానికి నేనూ నా మిత్రుడూ నిర్ణయించుకున్నాం. నిజానికి మేము అండర్ కవర్ 'రా' ఏజెంట్లము, ఈ విషయం నా భార్యకి కూడా తెలియదు. ఆమెని ఫాలో అవుతూ లీలా పాలస్ కి వెళ్ళాం. వాడు తనని అప్రోచ్ అవుతుండగా వాడిని పట్టుకుని అరెస్టు చేసేశాం. మా టీం వాడిని పట్టుకుపోయాక, నేను నా భార్యతో వుండగా వీళ్లెవరో నా మీద ఎటాక్ చేసి తీసుకొచ్చేశారు.

నా భార్య ఎక్కడ, నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు, చెప్పండి అని అడిగాను. ఇంతలో ఓ మూల నుంచి కిసుక్కు మని చిన్న నవ్వు వినబడింది. తల తిప్పి చూశాను, నాతొ పాటూ ఆ మనిషి కూడా.. ఓ అమ్మాయి ఆ గదిలో మూల టేబుల్ ముందు కూర్చుని పంటి కింద నవ్వుని తొక్కి పట్టి మోనిటర్లో చూస్తూ కనబడింది.

"ఈ అమ్మాయి భలే బావుంది" మనసులో అనుకున్నాను అనుకుంటూ బయటకే అనేశాను, ఇంజక్షన్ ప్రభావం అనుకుంటా. ఆ వ్యక్తి నా వైపు చురుగ్గా చూసి తల తిప్పి కోపంగా ఆమెని ఏమైందని అడిగాడు. "నథింగ్ సర్" అంది కొంచెం కంగారు పడుతూ, ఫర్లేదు చెప్పు అన్నాడు. "ట్రూ లైస్" కథ చెబుతున్నాడు సర్ అంది. 90ల్లో వచ్చిన అర్నాల్ ష్వార్జ్నెగ్గర్ సినిమా కథ సర్ అది అని చెప్పింది ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్న అతనితో. 

నా అయోమయం మరింత పెరిగింది. నిజంగానే నాకర్ధం కాలేదు. నా కథతో ఇలా ఓ సినిమా తీశారా? లేదు, 90ల్లో సినిమా అంటుందిగా, ఆ సినిమాలో చూపించినట్టుగానే నా జీవితంలో జరుగుతుందా? ఇలా నేను ఆలోచిస్తూండగా.. 

"కానీ ఈ ఇంజక్షన్ ట్రూత్ సెరమ్, ఇది తీసుకుని అబద్దం చెప్పలేరు. అంటే ఇతను నిజమే చెబుతూ వుండాలి , లేదా ఇదే నిజమని పూర్తిగా నమ్ముతూ వుండాలి" అన్నాడు. 

"ఇందాక ఎక్కడ వున్నాను అన్నారు?" అడిగాను. "వినిపెగ్, కెనడా. ఇక్కడే పట్టుకున్నాం నిన్ను" అన్నాడు. ఆశ్చర్యపోయాను, నేనిక్కడేం చేస్తున్నాను. వీళ్లెవరు, నన్నెందుకు బంధించారు? ఇందాకటినుంచీ గమనించలేదు వీళ్ళు ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు అదికూడా అమెరికన్ యాసలో..  ఆలోచిస్తుండగానే మగత కమ్మేసింది. 


Take 2 త్వరలో.. 

Comments