స్వైర స్వప్నం


దుప్పటి మొహం మీదకి లాక్కుని మరింతగా ముడుచుకుని పడుకుంటున్నాను.. 
"రేయ్.. త్వరగా లేచి రెడీ అయితే పోదాం" అన్న రాజేష్ గాడి మాటలు వినబడి నెమ్మదిగా దుప్పటి తప్పించి చూశాను. ఒక్క క్షణం ఎక్కడున్నానో అర్ధం కాలేదు. డాబా మీద పరుపు పరుచుకుని పడుకుని వున్నాను. పిట్టగోడ మీంచి రోడ్డు వైపు చూస్తూ  దమ్ము కొడుతున్నాడు రాజేష్ గాడు.

సడన్ గా వీడెక్కడినుంచి వచ్చాడు, నేను ఇక్కడెందుకున్నాను ఏమీ గుర్తురావడంలేదు. ఈ డాబా మేం కాలేజీలో చదివేటప్పుడు రెంటుకి తీసుకున్న ఇల్లు. తర్వాత ఖాళీ చేసి ఓ రెండు కిలోమీటర్ల అవతల వేరే రూమ్ తీసుకున్నాం. మేం ఖాళీ చేశాక ఈ డాబా ఇంకా ఎవరికీ ఇవ్వలేదనుకుంటా తాళం వేసుంది. ఇప్పుడు రూమ్ దాకా వెళ్లే ఓపిక లేదు దీని తాళం వుందా అనడిగాను. అయినా ఖాళీ చేసాక తాళం ఎందుకుంటుంది?

ఉంది, ఇదిగో అన్నాడు జేబులోంచి తాళం ఇస్తూ.. గుమ్మానికడ్డంగా వున్న సైకిల్ ని పక్కకి తీసి కిందనుంచి పైకి పెట్టిన గొళ్ళెంకున్న తాళం తీస్తూ సిగరెట్ ఇవ్వరా అన్నాను. ఇదిగో అంటూ తాను కాలుస్తున్న సిగరెట్ ఇచ్చాడు వాడు. ప్చ్ ఇది కాదురా లోపలికి కావాలి కొత్తది ఇవ్వు అన్నాను. సరే నేను పోతున్నా రెడీ అయ్యి వచ్చేసేయ్ అంటూ కొత్త సిగరెట్ ఇచ్చి వాడు వెళ్ళిపోయాడు.

దుమ్ము కొట్టుకుపోయి వున్నా టాయిలెట్లో నీళ్లు వస్తున్నాయి. నెమ్మదిగా అవశిష్టాలు తీర్చుకుని బయటకి వచ్చి నడవడం మొదలుపెట్టాను. వర్షం పడిందేమో రోడ్డంతా గుంతల్లో నీరు నిండి వుంది. ఇంకా సన్నగా తుప్పర్లు పడుతున్నాయి. ఆశ్చర్యకరంగా రోడ్డుమీద అక్కడక్కడా కుక్కలు తల వంచుకుని మూలుగుతూ నిలబడి వున్నాయి. పంజాబ్ గట్లెమ్మటా, పుట్టలెమ్మటా ఇంకా కాలిఫోర్నియా బై లేన్స్ లో మనం చూస్తున్న సగం వంగిపోయి కనబడే డ్రగ్ ఎడిక్ట్స్ గుర్తొచ్చారు.

నెమ్మదిగా ఊర్లోకి వచ్చేసాను, రిలయన్స్ స్మార్ట్ కొత్తది అనుకుంటా ఎప్పుడు పెట్టారో. దాటుకుని వెళ్తుంటే మేడం ఇల్లు కనబడింది. నాకు ఆవిడ ఎడ్రెస్ ఎలా తెలుసు? కొంచెం తటపటాయించాక వెళ్లి తలుపు కొట్టాను. ఓ చిన్న పిల్లోడు తలుపు తీశాడు, మేడం వున్నారా అనడిగాను. లోపలున్నారు రండి కూర్చోండి అన్నాడు. హాల్లో సోఫా కం బెడ్ మీద కూర్చున్నా.. 

కళ్ళు తెరిచేసరికి కంఫర్టర్ కప్పుకుని పడుకున్నా అని అర్ధమైంది, షర్ట్ లేదు ఎప్పుడు తీసేశానో తెలీదు. ఎక్కడ వున్నానో స్ఫూరించి గబుక్కున లేచి కూర్చున్నా..  ఆ కంఫర్టర్నే పైన కప్పుకుని చొక్కా ఎక్కడుందో అని వెదకడం మొదలెట్టాను. ఓ పెద్దావిడ కిచెన్ లోకి డైనింగ్ హాల్లోకి తిరుగుతుంది. మేడం వాళ్ళ ఆమ్మో అత్తగారో అయ్యుంటుంది. రెండో పక్కన వాషింగ్ మెషిన్ లో బట్టలు తీస్తూ మేడం కనబడ్డారు, తెల్ల చుడీదార్ వేసుకున్నారు, పక్కనించి చూసినా లీలగా సన్నటి నవ్వు కనబడింది ఆవిడ మోహంలో.

ఒక పొడుగాటి అమ్మాయి, కూతురనుకుంటా, మొహం నిండా నవ్వుతో నన్నే చూసూ వచ్చి ఎదురుగా వున్న సోఫాలో కాళ్ళు పైకి పెట్టుకుని కూర్చుంది. నా షర్ట్ అంటూ గొణిగాను. చూపులతో అక్కడుంది అన్నట్టుగా సైగ చేసింది. గబుక్కున తీసి వేసుకున్నాను. ఈ మేడం మా మిసెస్ వాళ్ళ లెక్చరర్, ఒక కార్పొరేట్-కాలేజీ కాన్ఫరెన్స్ లో కనబడితే నా ఫేవరెట్ టీచర్ అంటూ పరిచయం చేసింది. 

మనిషి చిక్కిపోయిన ఫరీదా జలాల్ లా వుంటుంది. యంగ్ సుహాసిని మూలే అనొచ్చా..? అంత ఆహ్లాదకరమైన మొహం ఎక్కడా చూళ్ళేదు. ఆ కల్మషం లేని నవ్వు.. చేష్టలుడిగిపోయి వెర్రోడిలా ఆమె మొహమే చూస్తూ నిలబడ్డాను. ఆవిడేమనుకుంటుందో అనే ఆలోచన కూడా లేదు. మిసెస్ గారైతే వాళ్ళ మేడంని చూసిన ఆనందంలో ఏం జరుగుతుందో పట్టించుకునే స్థితిలో లేదు (thank god). మేడంకి మాత్రం అర్ధమైంది, కానీ తనకిది మామూలే అన్నట్టు నావైపో నవ్వు విసిరి మా ఆవిడతో కబుర్లలో పడిపోయింది.

"సో, ఎవరు మీరు?" అంటూ ఓ మగ గొంతు వినిపించే సరికి మళ్ళీ ఈలోకంలోకి వచ్చాను. మేడం భర్త అనుకుంటా, గంభీరంగా వున్నాడు. హఠాత్తుగా అలా అడిగితే ఏం చెప్పాలో తోచలేదు. నేను నీళ్లు నములుతుండగా.. "నా స్టూడెంట్" అంటూ మేడం నవ్వుతూ వచ్చి అయన పక్కన కూర్చున్నారు. ఆ మొహం, ఆ నవ్వు చూసి మరొక్క సారి మనసంతా ఆనందంతో నిండిపోయింది. కాసేపు కూర్చున్నాక ఇచ్చిన టీ తాగేసి వస్తానండీ అని నిలబడ్డాను. మేడంగారు నాతోబాటు గుమ్మం బయటకి వచ్చారు.

థాంక్ యు అండీ, ఈ రోడ్డులో మా ఫ్రెండ్ ఇల్లుంది వస్తూ మీ ఇల్లు కనబడగానే ఒక్కసారి చూడాలనిపించింది. ఇబ్బంది పెడితే క్షమించండి అని గబగబా చెప్పేశాను. ఫర్వాలేదు, థాంక్స్ ఫర్ కమింగ్ అని నవ్వారు మేడం.

ఆ హై లో వెనక్కి రావడం మొదలెట్టాను. చీకటి పడుతుంది. పాడుబడిపోయిన మా తాతగారి ఇల్లు కనబడింది. చుట్టూ గాఢాంధకారం. చూసుకోకుండా ఒక సాఫ్ట్ ఆబ్జెక్ట్ ని గుద్దాను. కుయ్ మంటూ మూలిగింది కానీ ఒక్కడుగు కూడా ముందుకు కదల్లేదు ఇవి డ్రగ్ ఎడిక్ట్ కుక్కలే అనుకుంటూ తప్పించుకుని ఇంటి గుమ్మంలోకి నడిచాను. ఎత్తుగా మెట్లున్నాయి కానీ కింద వరుస మెట్లు కూలిపోయాయి. ఒక కుక్క పైకి ఎక్కాలని కష్ట పడుతుంది. మామూలుగా అయితే ఎగిరి ఎక్కేయాలి కానీ ఇదేంటి అనుకుంటూ దాన్ని తప్పించుకుని గుమ్మం లోపలికి చూశాను.

వసారా వెలుతురులో లీలగా కృష్ణ గాడు కనబడ్డాడు. వీడిక్కడేం చేస్తున్నాడు? రారా లోపలికి అన్నాడు వాడు. ఈ లోపు ఆ కుక్క మెట్లెక్కేసి దుముకుతూ ఆ వసారా లో వున్న తడిక రంధ్రంలోకి దూరిపోయింది. దాని వెనుకున్న ఇంకో పెద్ద కన్నంలోకి దూరి ఆ వెనకున్న గదిలోకి పోయింది.

సరిగ్గా ఇప్పుడు మెలకువ వచ్చింది. ఎప్పుడో కానీ కలలు గుర్తుండవు, ఇది మాత్రం విచిత్రంగా వుంది మరొక్కసారి మొత్తం నెమరేసుకున్నాను. లేవగానే రాసిపెట్టుకోవాలి మళ్ళీ మర్చిపోకుండా అనుకున్నాను. 

ఈ రాజేష్ గాడు నాకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో రూమ్మేట్. కాలేజ్ అయిపోయిన రెండేళ్లలో కాన్సర్ తో చనిపోయాడు. కృష్ణ గాడు నాలుగేళ్ళూ రూమ్మేట్, ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ మల్టీనేషనల్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో జనరల్ మేనేజర్. ఆ మేడం అంటూ ఎవరూ లేరు. ఆ పాత్ర ఎందుకొచ్చిందో తెలీదు. ఎవరైనా సైకో అనలిస్టుకి చెప్పి మొత్తం కల డీకోడ్ చేయించుకోవాలి అని ఆలోచిస్తూ మళ్ళీ నిద్ర పోయాను.. 


Comments

  1. అన్నయ్యా! కల కాస్త కళగా మరింత ముస్తాబు దిద్దుకుంది. కానీ ఇదంతా నిజమైతే ఎంత బాగుంటుందో అన్నంత హాయిని కేవలం కలల్ని మాత్రమే అనుకోగలం. మేడమ్ ట్విస్ట్ మాత్రం అదిరింది అన్నయ్య... 👌👏❤️🙏

    ReplyDelete

Post a Comment