నందమూరి కుటుంబంతో అనుబంధం, పార్టీలో అతని స్థానం, భవిష్యత్తు, etc., ఈ blog లో చూద్దాం. కమ్మ సామాజికవర్గపు హార్డ్ లైనర్స్ ఒప్పుకోకపోయినా అభిమానులు ప్రేమగా పిలుచుకునే బుడ్డోడు ఈ తరం నందమూరి వారసులలో అత్యంత విజయవంతమైన స్టార్. కొందరు అభిమానులు ఇంకో అడుగు ముందుకేసి బాలకృష్ణ కంటే గొప్ప నటుడు అని కూడా అంటారు. ఎవరిష్టం వారిది కానీ నిస్సందేహంగా అతని కంటే మంచి వాచకం, వాక్పటిమ అయితే వున్నాయి. వర్తమాన నటులలో అతనిది ప్రత్యేక స్థానం.
మనకి తెలిసినంతలో అతని బాల్యం అంత సాఫీ ప్రయాణమైతే కాదు. తాత వెండితెర ఇలవేలుపు అయినా తనది దిగువ మధ్యతరగతి జీవితమే. రామారావు తనయుడు హరికృష్ణ తనని తన తల్లినీ నిరాదరణకు గురి చేసింది నిజం. తల్లి సంపాదనకు తోడుగా తానూ కూచిపూడి నృత్యం చేసి ఎంతో కొంత సంపాదించేవాడు. మనిషి హైపర్ యాక్టీవ్, మహా చురుకు. చిన్నతనంలో స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. కోచ్ పర్మిషన్ తీసుకుని డాన్స్ ప్రోగ్రామ్స్ కి తీసుకెళ్లేది తల్లి (కోచ్ చెప్పిన మాటలివి). ఈక్రమంలో రామారావుకి ఈ కుర్రాడిది మహర్జాతకం అని తెలిసింది. పిలిపించుకుని తన పోలికలు కొట్టవచ్చినట్టు కనబడడం చూసి ముచ్చటపడి తారక్ రామ్ అనే పేరుని తారక రామారావుగా మార్చి అక్కున చేర్చుకున్నారు.
అప్పుడే బాల నటుడిగా జూనియర్ ని పెట్టి బాలరామాయణం తీశారు. అప్పటికీ మిగిలిన కుటుంబ సభ్యులు దగ్గరకి రానిచ్చేవారు కాదు. అవమానాలు కొనసాగుతూనే వుండేవి. కాకపోతే రామారావు అండ వల్ల కొంత ఆర్ధిక సమస్యలు తగ్గాయి. హరికృష్ణ పూనుకుని హీరోగా తెరంగ్రేటం కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. మొదటి చిత్రం వచ్చింది పోయింది. జనం మరీ పిల్లాడిని తొందరపడి తెచ్చేశారు అనుకున్నారు. మరోసారి తమ పలుకుబడితో స్టూడెంట్ నెం. 1 అనే సినిమాలో అవకాశం వచ్చింది. నిజానికి రాజమౌళి ఈ సినిమా ప్రభాస్ తో చేయాలనుకున్నాడు. తనకీ అదే మొదటి సినిమా కాబట్టి తన ఇష్టం కుదరలేదు. ఈ సినిమా మంచి హిట్. ఆ వెనుకే ఆది, తర్వాత రాజమౌళితోనే సింహాద్రి వరసగా సంచలన విజయాలు రావడంతో స్టార్ గా నిలదొక్కుకున్నాడు జూ|| ఎన్టీఆర్.
ఈ క్రమంలో నందమూరి వారసులు ప్రత్యామ్నాయం కోసం చైతన్యకృష్ణ, తారక రత్న ఇలా ఒక్కో మనవడినీ ప్రయత్నించసాగారు. తారకరత్నకి అయితే ఒకేసారి 9 సినిమాలు అనౌన్స్ చేశారు. ఏ ఒక్కరూ నిలదొక్కుకోలేక పోవడంతో మూడో తరంలో నందమూరి కుటుంబానికి తారక్ రామ్ అనబడే జూనియరే దిక్సూచిగా మిగిలాడు. మిగిలిన వాళ్ళు దూరం పెట్టినా హరికృష్ణ కొడుకుని అక్కున చేర్చుకున్నారు. తన మరో ఇద్దరు కుమారులతో పాటు మూడో కొడుకుగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ ప్రస్థానంలో జూనియర్ వెనుక బలంగా నిలబడింది టీడీపీలోని హరికృష్ణ వర్గం. కొడాలి నానీ, వల్లభనేని వంశీ లాంటి వారు తారక్ మొదటి చిత్రం నుంచీ వెన్నుదన్నుగా వున్నారు. తనతో సినిమాలు కూడా తీశారు. హరికృష్ణ వారి రాజకీయ భవిష్యత్తుకు తన వంతు సాయం చేశారు. ఈవర్గం ఇప్పటికీ ఎన్టీఆర్ వెనుక వుంది.
2009 చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రోజులు. చిరంజీవి ప్రజారాజ్యం సినీ గ్లామర్ ని ఎదుర్కోవడానికి అప్పటివరకూ దూరంగా పెట్టిన జూనియర్ ని చేరదీశారు. చంద్రబాబు, బాలకృష్ణ కంటే వాక్పటిమతో ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు జనాలని ఆకట్టుకున్నాయి. ఆ క్రమంలో ప్రమాదానికి గురికావడం బెడ్ మీద నుంచి ప్రచారం చేయడం జరిగాయి. అయితే టీడీపీ ఓడిపోవడం ఎన్టీఆర్ ప్రచారం చేసిన చోట్లా గెలవకపోవడం ఎదురు దెబ్బే. అయితే చంద్రబాబు తన సోదరి మనుమరాలితో (నార్నె వారి అమ్మాయి) ఎన్టీఆర్ వివాహం చేసి కుటుంబంలో కలపడానికి ప్రయత్నించారు. బాలకృష్ణ, మిగిలిన కుటుంబం కూడా బాగానే కలుపుకున్నారు.
ఇక హరికృష్ణ వర్గం నెమ్మదిగా తెలుగుదేశానికి భవిష్యత్తు జూనియరే అని చాప కింద నీరులా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇది బలపడితే తన రాజకీయ వారసుడిగా కొడుకు లోకేష్ కు రాజకీయ భవిష్యత్తు వుండదన్న భయం బాబుకు పట్టుకుంది. దానికి మొదటగా కుటుంబాన్ని తనవైపు తిప్పుకోవాలి. సామజిక వర్గపెద్దల సూచనతో కొడుక్కి బాలకృష్ణ కూతురిని వివాహం చేసుకున్నారు. దరిమిలా నందమూరి కుటుంబంలో కొందరు మళ్ళీ చంద్రబాబు వైపు మళ్లారు. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కడానికి పూనుకున్నారు. సినీ కెరీర్ మీద కన్నేశారు.
ఎన్టీఆర్ సినిమా రిలీజ్ సందర్భంగా ఆ సినిమాని చూడకూడదని బాలకృష్ణ ఫాన్స్ మెసేజీలు తిరిగాయి. దానికి తగ్గట్టు ఆ టైములో సినిమాలు కూడా వివిధ కారణాల వల్ల సరిగా ఆడలేదు. ఎన్టీఆర్ కెరీర్ పరంగా గడ్డుకాలం ఎదుర్కొన్నారు. అయితే ఈ సమయంలో హరికృష్ణ కుటుంబం ఎన్టీఆర్ వెనుక బలంగా నిలబడ్డారు. ఎన్టీఆర్ కూడా తాత పేరు చెప్పుకుని కొంతవరకే వెళ్ళగలం అనేది గ్రహించి అప్పటివరకూ అవసరం లేకున్నా తాత పేరు తెచ్చేది మానేశారు. దీనికితోడు అవసరం లేకపోయినా పొలిటికల్ డైలాగ్స్ పెట్టడం కూడా తగ్గించారు. సమర్థులైన పూరి జగన్నాధ్, సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ వంటి దర్శకులతో సినిమాలు చేయడం అవి విజయవంతం కావడంతో కెరీర్ మళ్ళీ గాడిలో పడింది.
2014లో చంద్రబాబు ఎన్టీఆర్ని దూరం పెట్టి పవన్ కళ్యాణ్ని నమ్ముకోవడం ఆ వర్గానికి ఎదురు దెబ్బ. హరికృష్ణ వర్గాన్ని పూర్తిగా దూరం పెట్టడంతో అప్పటికే వైసీపీ లో చేరిపోయిన కోడాలి నానీతో పాటు, 'అన్నం తినే వాడెవడూ వైసీపీలో చేరడు' అన్న వంశీ కూడా అదే వైసీపీలో చేరిపోయాడు. అయితే ఈ ఇద్దరూ ఇప్పటికీ ఎన్టీఆర్ మనుషులే అన్నది అందరికీ తెలిసిందే. లోకేష్ సమర్ధత మీద అనుమానాల్లేని ఈ వర్గం ఎప్పటికైనా తెలుగుదేశం జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకే వస్తుందని పూర్తి నమ్మకంతో వున్నారు. అప్పటివరకూ సినిమాలు చేసుకుంటూ తన వర్గ ప్రయోజనాలు కాపాడుకుంటే చాలు అనేది Jr. NTR వ్యూహం. అమిత్ షా ఎన్టీఆర్ ని కలవడం తెదాపా వర్గాల్లో కలకలం సృష్టించింది. జూనియర్ కి పగ్గాలు ఇస్తే పొత్తుగురించి ఆలోచిస్తామని ఢిల్లీ పెద్దలు చెప్పారని ఎన్టీఆర్ వర్గం ప్రచారం చేసుకుంది. దీనిపై బీజేపీ, టీడీపీలు స్పందించలేదు. హీరో నితిన్ కూడా అమిత్ షాని కలిసాక దీని ప్రాధాన్యత తగ్గింది.
కమ్మ సామాజికవర్గంలో కొందరు పార్టీకి పునర్వైభవం తెస్తాడని ఎన్టీఆర్ మీద ఆశపెట్టుకున్నారు. ప్రచారంలో కార్యకర్తలు ఎన్టీఆర్ ఎప్పుడు వస్తారు అని డైరెక్ట్ గా బాబునే అడగడం ఇబ్బందికరమే. తన పొలిటికల్ యాంబిషన్స్ ని ఎన్టీఆర్ ఎప్పుడూ దాయలేదు. కాకపోతే సినిమాల్లో ఆ డైలాగులు తగ్గించాడు. ఇప్పటికిప్పుడు పగ్గాలిచ్చినా తీసుకోడానికి రెడీ అని ఒక అంచనా. సినిమాల్లో మంచి స్థానం వుంది, భవిష్యత్తు వుంది, పైగా వయసు వుంది. ఇప్పటికిప్పుడు దాన్నెందుకు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చేస్తాడు. పవన్ కళ్యాణ్ అంత ఆవేశం తపన/పిచ్చి అయితే లేవుగా అనడిగితే..
ఒక వైసీపీ విశ్లేషకుడు ఈ విధంగా అన్నాడు. "ఎన్టీఆర్ మూవీస్ లో ఇప్పటికే తన కెరీర్ పీక్స్ చేరుకున్నాడు. వున్న కంపిటిషన్ లో ఇంతకంటే పెద్ద స్థానం కష్టమే. విపరీతమైన పొలిటికల్ యాంబిషన్ వుంది. అన్నిటికంటే ముఖ్యంగా తెలుగుదేశం అనే అతి పెద్ద పొలిటికల్ పార్టీ బంగారు పళ్లెం లో దొరుకుతోంది. తాతగారిలా తాను కొత్త పార్టీ పెట్టి ముందుకు తీసుకెళ్లే సత్తాగానీ పరిస్థితులుగానీ లేవు. ఇలాగే కొనసాగితే Sr. ఎన్టీఆర్ని పంపేసినట్టే చంద్రబాబునీ పంపేయడం ఖాయం, తనకంటే చరిష్మా వున్నవారు పార్టీలో లేరు గనుక అప్పుడు తనదగ్గరకే వస్తారు. జగన్లా నిలబడితే ఒకరోజు ముఖ్యమంత్రి కూడా అవ్వొచ్చు". ఈ విశ్లేషణ అయితే నమ్మబుల్ గానే వుంది. చూద్దాం ముందు ముందు ఏం జరుగబోతుందో. ప్రజలు బాబుని నమ్మే పరిస్థితి లేదన్నది స్పష్టం. బాబు ఇంకా తానే ముఖ్యమంత్రి అభ్యర్థని చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి పవనే అని జనసేన కుండబద్దలు కొట్టేసింది. బీజేపీ అసలు పొత్తేలేదు పొమ్మంది.
ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలకు ముందు జరిగే పరిణామాలు వాటి ఫలితాల మీదే జూ|| ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తు వుండబోతోంది. వేచి చూద్దాం.
- @sree_n_r
Comments
Post a Comment