ఆవిర్భావం
1982 లో స్వర్గీయ NT రామారావు ఆనాటి రాజకీయ శూన్యతను పూరించడానికి తమ సామజిక వర్గానికి చెందిన నాదెండ్ల భాస్కర రావు లాంటి నాయకులు, రామోజీరావు వంటి మీడియా అధిపతులు, పారిశ్రామిక వేత్తలు, మరికొందరు కాంగ్రెస్ అనుభవజ్ఞులతో కలిసి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయనకి పొరుగు రాష్ట్ర నాయకుడు, స్నేహితుడు, తనలాగే వెండితెరమీద వెలిగి రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన MG రామచంద్రన్ స్ఫూర్తి. అప్పటివరకూ వున్న రబ్బరు స్టాంపు ప్రభుత్వాలని చూసి రాష్ట్ర నాయకుల బానిసత్వపు ధోరణి చూసి విసిగిపోయిన జనం రామారావుకి బ్రహ్మ రధం పట్టారు. రాష్ట్ర రాజకీయాలంటే కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, అధిష్టానాన్ని మెప్పించడం మాత్రమే అన్న భావనలో వున్న ప్రజలకు వేరే ప్రత్యామ్న్యాయం వుందన్న విషయం తెలిసింది.
ఈ దశలోనే తెలుగుదేశం అనే ఒక ప్రాంతీయ పార్టీ పార్లమెంటులో రెండో అతిపెద్ద పార్టీగా, ముఖ్య ప్రతిపక్ష పార్టీగా ఆవిర్భవించింది. దక్షిణాది అంటే మద్రాసీలు మాత్రమే అనే అపోహలో వుండే ఉత్తరాదికి తెలుగువారు వేరు అనే స్పృహ కలిగింది. బానిసల్లా వ్యవరించే తెలుగు నాయకులే తెలిసిన అప్పటి కాంగ్రెసు అధిష్ఠానానికి తెలుగువారి అస్తిత్వం వేరు. వారు తమని వ్యతిరేకించగలరు అనేది అర్ధమైంది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం.
పతనం - పునరుద్ధానం
రామారావు ఆవేశపరుడు ముందుచూపు కంటే క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలే ఎక్కువ అనే భయంతో (అవకాశ వాదం అని కూడా కొందరు అంటారు) 1984 ఆగష్టులో నాదెండ్ల భాస్కరరావు నాయకత్వంలో తిరుగుబాటు చేసి రామారావును తప్పించి తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే ఇది కాంగ్రెస్ కుట్ర అని భావించిన ప్రతిపక్షాలు పొరుగు రాష్ట్రాల నాయకులు అందరూ రామారావుకి మద్దతిచ్చి, అండగా నిలిచి తిరిగి ముఖ్యమంత్రి కావడానికి సాయం చేశారు.
తిరిగి అధికారంలోకి వచ్చిన రామారావు పార్టీలో తన ఆధిపత్యం చూపించి తానే పార్టీ పార్టీయే తాను అన్నది నిరూపించడానికి ఒక్క కలంపోటుతో ఎమ్మెల్యే లందరినీ బర్తరఫ్ చేసి మరోసారి ప్రజాతీర్పుకోసం ఎన్నికలకు వెళ్లారు. అప్పటికీ ప్రజలు ఆయన్ను ఆదరించడంతో తిరుగులేని పట్టుతో పార్టీని నడిపారు. అయితే రామారావు నియంతృత్వ ధోరణి, పాలన మీద పట్టులేకపోవడం, ప్రతీదానికి ఫక్తు నాటకీయ విన్యాసాలు చేయడంతో విసిగిపోయిన ప్రజలు 1990లో తెలుగుదేశాన్ని ఘోరంగా ఓడించి తిరిగి కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు.
ఈ క్రమంలో అప్పటివరకూ తెరవెనుక మంత్రాంగం చేసిన చంద్రబాబు నాయుడు అంతర్గత ఆధిపత్య పోరులో ఫైచేయి సాధించి పార్టీలో పట్టు సంపాదించారు. ఎన్టీఆర్ తీసుకునే పార్టీ పరమైన తొందరపాటు నిర్ణయాలని క్యాడర్లో తనకు అనుకూలంగా మార్చుకునేవారన్న వాదన కూడా వుంది. యధావిధిగా కాంగ్రెస్ కుమ్ములాటలు, అవినీతి, మత కల్లోలాలు పెచ్చరిల్లి పోవడంతో 1994 లో ముచ్చటగా మూడోసారి రామారావు ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే ఎన్నికలకి ముందే ఆయన లక్ష్మీ పార్వతితో తన సంబంధాన్ని బహిర్గతం చేసి ప్రచారానికి ఆమెనీ రాష్ట్రమంతా తిప్పారు. ప్రజలు మాత్రం దీనిని పట్టించుకోకుండా రామారావుకి మరోసారి బ్రహ్మ రధం పట్టారు. ఇక్కడినుంచి పార్టీలో లక్ష్మి పార్వతి ప్రాబల్యం పెరిగింది. అప్పటివరకూ ప్రభుత్వంలో చక్రం తిప్పిన చంద్రబాబు తన ప్రాముఖ్యతను కోల్పోయారు. ఆవిర్భావం నుంచీ పార్టీలో వున్న పెద్దలు కొత్తగా వచ్చిన లక్ష్మిపార్వతి ప్రాపకం కోసం ఎదురుచూడాల్సి రావడం జీర్ణించుకోలేక పోయారు. ఒకప్పుడు ఎన్టీఆర్ కాళ్ళు మొక్కిన నాయకులు ఇప్పుడు పార్వతి కాళ్ళూ పట్టుకోవాల్సిన పరిస్థితి. లక్షి పార్వతి వర్గంగా మారిన కొందరు చోటామోటా నాయకులు తమపై పెత్తనం చేయడం మింగుడుపడని పరిస్థితి. పార్టీలో ఫైనుంచి దిగువ స్థాయి వరకూ ఈ అసంతృప్తి అంతర్గతంగా ప్రబలిపోయింది.
ఆగష్టు సంక్షోభం
పార్టీ పుట్టుకకు వెన్నుదన్నుగా నిలిచి ఆర్ధికంగా పార్టీని నిలబెట్టిన సామజిక వర్గపు పారిశ్రామిక వేత్తలు, పెద్దలు తమ చేతుల్లోంచి పార్టీ జారిపోతుందన్న విషయాన్ని గ్రహించి దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. రామారావు కుటుంబంలోకానీ పార్టీకి చెందిన సామజిక వర్గం వారు కానీ ఆయనంత చరిష్మా వున్న వ్యక్తి ఇంకొకరు లేరు కాబట్టి వున్న వారిలో తెలివైన వాడు, చురుకైన వాడైన చంద్రబాబుతో రెండోసారి రామారావుని దించడానికి పూనుకున్నారు. రెండో ఆగస్టు సంక్షోభానికి కుల పెద్దలు కుటుంబసభ్యులే కారణం అయ్యారు. ఒకప్పుడు రామారావుని దైవాంశ సంభూతుడిగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రముఖ మీడియా (ఈనాడు) ఆయన్ని ఒక స్త్రీ వలలో పడి విచక్షణ కోల్పోయిన వ్యక్తిగా చూపించడం మొదలు పెట్టింది.
రామారావు కంటే చంద్రబాబు తెలివైనవాడు, చురుకైన వాడు, ముందు చూపుగలవాడు, అపర మేధావి, చాణక్యుడు లాంటి విశేషణాలతో ప్రజల్లో ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. మీడియా మాయాజాలంతో తిరుగుబాటు అనే డ్రామా నడిచింది. అసలు ఎంతమంది తిరుగుబాటు చేశారు ఎంతమంది రామారావుతో వున్నారు అనే విషయం బయటకు రానీకుండా మొత్తం నాటకం నడిచింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రామారావు ఘోష ఎవరికీ వినిపించకుండా జాగ్రత్త పడ్డారు. కాంగ్రెసు నుంచి అగ్ర సినీ నాయకుడు చిరంజీవి వరకూ దాదాపు అందరినీ రామారావు సాయం అర్ధించారు కానీ తమ తమ అవసరాలు, పరిమితుల రీత్యా ఎవరూ ముందుకు రాలేదు. ఆఖరికి పక్క రాష్ట్రం నుంచి రజనీకాంత్ ని కూడా రప్పించారు. రాగానే మద్దతు పలికిన రజనీకాంత్, బాబు వర్గాన్ని కలిశాక ఆ దుష్టగ్రహం నీడనుంచి రామారావు బయటకు రావాలి అని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇంత డ్రామా జరుగుతున్నా రాష్ట్ర ప్రజలు ఇది కుటుంబ ఆధిపత్య పోరుగానే భావించారు తప్ప ప్రజాస్వామ్యానికి జరుగుతున్న అన్యాయంగా అనుకోలేదు. రామారావు మీద పెద్దగా సానుభూతి కూడా చూపించలేదు. ఈ నేపథ్యంలో 1995లో నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు.
తెలుగుదేశంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ప్రస్థానం ముగిసి చంద్రబాబు నాయుడి శకం మొదలైంది.
(తరువాయి వచ్చే భాగంలో...)
Comments
Post a Comment