సిరివెన్నెల సినిమాలో ఈ పాట మొదటిసారి విన్నప్పుడు ఇదేదో సంస్కృతం పాటలే మనకి అర్ధం కాదు అని తేలిగ్గా తీసుకున్నా. దానికి కారణం, అంతకు ముందనుకుంటా ఒక సినిమాలో అచ్చంగా సంస్కృతం పాటే వుంది. ఇదీ ఆ బాపతేనేమోలే అనుకున్నా ఆ తర్వాత ఎవరో చెప్పారు అది తెలుగు పాటేనోయ్ అని. తెలుగుపాట కూడా అర్ధం కాకపోతే అవమానంగా భావించి, అందరూ హమ్ చేస్తున్న అంత గొప్ప పాటకి అర్ధం తెలుసుకోవాలని బలంగా అనిపించింది.
అయితే, ఇప్పటిలా ఇంటర్నెట్టూ గూగులమ్మా లేరు. ఒక్కో పదం పదిసార్లు విని సమాసాలు విడదీసి పదాలు పట్టుకుని అర్ధం వెతుక్కుంటే కానీ తెలియలేదు ఆయన చెప్పిందేంటో.
తర్వాత ఎప్పుడో ఒక సందర్భంలో ఆయన చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుండిపోయింది. ప్రతీ పదం అర్ధం అవ్వాలని సులభమైన సరళమైన పదాల్లో రాయనక్కరలేదు. నచ్చితే అర్ధం వాళ్ళే తెలుసుకుంటారు అని. నిజమే, శ్రోత/ప్రేక్షకుడి మేధని సవాలు చేసి, కవ్వించి, ఉర్రూతలూగించిన కవి ఆయన.
తన పాటని ఎంత గొప్పగా ఆస్వాదిస్తారో ఇంకొకరు వ్రాసిన దానీకీ అంతే గొప్పగా అనుభూతి చెందడం ఆయనకే చెల్లింది. పోయినేడు విడుదలైన 'అలవైకుంఠపురం లో ' పాటలు వ్రాసిన అందరు కవులతో ఆయన చేసిన ఇంటర్వ్యూ దానికి వొక తార్కాణం. తన పాట కంటే వారి పాటలు చర్చించి మెచ్చుకుని ప్రోత్సాహ మందించడం ఒక తండ్రి తన బిడ్డల వున్నతిని ఆస్వాదించడానికి ఏమాత్రం తీసిపోదు. ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసింది, తన శిష్యు లందరికీ తనను తాను నాన్నగారు అనే చెప్పుకుంటారు. అంత వాత్సల్యం ఈ రోజుల్లో చాలా అరుదు.
దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు సిరివెన్నె లమరపురికి
తెలుగు సినీ సాహిత్యాన్ని అనాథను చేసి కార్తీకమాసం ఆఖరు రోజున ఆయన నమ్మే ఆదిభిక్షువు చెంతకు వెళ్లిపోయా రనుకుంటా. తెలుగు సాహిత్యం వున్నంతవరకు మా స్మృతిఫలకం పై మీ సంతకం చెరగదు 🙏🙏
పూర్వ సినీ కవులు పెద్దగా పరిచయం లేదు కానీ వేటూరి గారు నా అభిమాన కవి. ఆయన పరమపదించినప్పుడు సిరివెన్నెల గారు గురుభావంతో నివాళులర్పిస్తూ వ్రాసినది ఇప్పటికీ గుర్తుంది. వేటూరి గారి వారసత్వాన్ని అంతకంటే ఘనంగా ముందుకు తీసుకెళ్లిన మహాకవి సిరివెన్నెల గారు🙏
అలాగే సిరివెన్నెల వారి ఘనసిరిని ముందుకు తీసుకెళ్లే మ/బృహత్తర భాద్యత వర్తమాన కవులపై వుంది. వాళ్లపై మాకు నమ్మకముంది.
ఓం శాంతి శాంతి శాంతిః 🙏🙏🙏
అనాది జీవన వేదం
ఓం...
ప్రాణనాడులకు స్పందననొసగిన
ఆది ప్రణవనాదం
ఓం...
కనుల కొలనులో ప్రతిబింబించిన
విశ్వరూప విన్యాసం
యెద కనుమలలో ప్రతిధ్వనించిన
విరించి విపంచి గానం
ఆ...
సరసస్వర సుర ఝరీగమనమౌ
సామవేద సారమిది
సరసస్వర సుర ఝరీగమనమౌ
సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
ప్రాగ్దిశ వేణియ పైనా
దినకర మయూఖ తంత్రుల పైనా
జాగృత విహంగ తతులే
వినీల గగనపు వేదిక పైనా
ప్రాగ్దిశ వేణియ పైనా
దినకర మయూఖ తంత్రుల పైనా
జాగృత విహంగ తతులే
వినీల గగనపు వేదిక పైనా
పలికిన కిలకిల ధ్వనముల స్వరగతి
జగతికి శ్రీకారము కాదా
విశ్వకార్యమునకిది భాష్యము గా..
విరించినై...
జనించు ప్రతి శిశు గళమున పలికిన
జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు
హృదయ మృదంగధ్వానం
జనించు ప్రతి శిశు గళమున పలికిన
జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు
హృదయ మృదంగధ్వానం
అనాదిరాగం ఆదితాళమున
అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునీ
విరించినై...
నా నిశ్వాసం గానం
నా వుచ్చ్వాసం కవనం
నా నిశ్వాసం గానం
సరసస్వర సుర ఝరీగమనమౌ
సామవేద సారమిదీ
నే పాడిన జీవన గీతం ఈ గీతం||
🙏🙏🙏
ReplyDelete