ఒక కుటుంబం సాఫీగా నడవాలంటే ఆదాయానికి మించని వ్యయం చేయాలి. తప్పక అప్పులు చేసినా వాటిని తీర్చే ప్రణాళిక వుండాలి. రాష్ట్రాన్ని చూస్తుంటే, రాబడి మార్గాలు మూసేసి, సంక్షేమ పథకాల పేరున వుచితంగా డబ్బులు పంచుతూ, ప్రతీనెలా వేల కోట్లు అప్పులు చేస్తూ రాష్ట్రం ఎప్పటికీ కోలుకోనీకుండా చేస్తున్నారనిపిస్తుంది.
ఉచితపథకాలు:
కొత్తవీ, పేర్లుమార్చినవీ, అన్ని పథకాలూ జేర్చి నెలకి 4,000 కోట్ల వరకూ అవుతుందనే అంచనాతో 2021 వార్షిక బడ్జెట్లో 48,083.92 కోట్లు కేటాయించింది వైకాపా ప్రభుత్వం. వీటిలో కొన్ని పథకాలని తెలివిగా కుదించడం, తీసేయడం కూడా చేశారు. ఉదాహరణకి పీజీ విద్యార్ధులకి జగనన్న విద్యాదీవెన లేదు. కుల కార్పొరేషన్లు ఇచ్చిన విదేశీ విద్యా సహాయం ఇప్పుడు లేదు. ఎంతమంది పిల్లలున్నా అమ్మవడి ఇస్తామని చెప్పి తర్వాత ఒక్క బిడ్డకే పరిమితం చేశారు. ఏటా 250/- చొప్పున పెంచుతామన్న పెన్షన్ పెరగలేదు.
వృధా ఖర్చులు:
సంక్షేమం పేరుతో పంచిపెట్టడం చాలదన్నట్టు అక్కరకు రాని ఖర్చులు చాలా చేస్తుందీ ప్రభుత్వం. ప్రభుత్వ ఆస్తులకి వైకాపా రంగులు వేయడానికి, కోర్టులకి, లాయర్లకు, రంగులు తీసేయడానికి అయిన ఖర్చులు చూశాం. గ్రామ సచివాలయాలని 1.22 లక్షల ఉద్యోగాలు సృష్టించారు. ఇది పంచాయితీల అధికారాలు తగ్గించడమే కనుక చెల్లవు అని కోర్టు అంటుంది. వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆ ఉద్యోగాలు ఆవిరై పోతాయి.ఇంటికే రేషన్ పంపిణీ అని వాహనాలకి సుమారు 800 కోట్లు ఖర్చు చేశారు. పక్క వీధిలో షాపు దగ్గర తమకు వీలైనప్పుడు తెచ్చుకునే రేషన్ ఇప్పుడు సందు చివరకి బండి ఎప్పుడొస్తే అప్పుడే తెచ్చుకోవాల్సిన పరిస్థితి.
ఆదాయ వనరులు:
రాబడి మార్గాలు పెంచుకోవడానికి ప్రయత్నించడం మానేసి ప్రభుత్వం తమ చేతకానితనం, కక్ష సాధింపు చర్యలతో ఒక్కో అవకాశాన్నీ పోగొట్టుకుంటుంది. అదానీ, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కియా మోటార్స్ అనుబంధ సంస్థలు ముందే వెళ్లిపోయాయి. రిలయన్స్ చేతులెత్తేసింది, అమరరాజా వెళ్ళిపోతోంది, జువారి సిమెంట్ పోరాడుతుంది. అసలు రానివి చాలానే వున్నాయి. వీలైనంత పన్నులు పెంచి ఆదాయం రాబట్టడానికి ప్రయత్నిస్తుందీ ప్రభుత్వం. ఆస్తి పన్ను ఇంటి యజమానితోపాటు కిరాయిదారుడు కూడా కట్టాలి, చెత్త మీద పన్నులు వేస్తున్నారు. పెట్రోలు, డీజిలు నుంచీ నిత్యావసర వస్తువులదాకా అన్నిటి ధరా బయట రాష్ట్రాలకన్నా ఎక్కువ.జీతభత్యాలు, అప్పులు:
ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కోసం 5,500 కోట్లు, సామజిక భద్రతా పెన్షన్లకు 1500 కోట్లు, అప్పులమీద వడ్డీలకు 3,500 కోట్లు వెరశి నెలకు 10,500 కోట్ల రూపాయలు చెల్లింపులు చేయాల్సివుంది. బ్యాంకులు ఇకమీదట అప్పులు ఇవ్వలేమని చేతులెత్తేశాయి. విశాఖ కలెక్టర్ ఆఫీసుతో సహా వందల ఎకరాల భూమిని తాకట్టు పెట్టారు. పథకాలకోసం బీసీ, ఎస్సీల్లాంటి కార్పొరేషన్ల నిధులూ మళ్లిస్తున్నారు.లోటుని పూడ్చడానికి ప్రతీ నెలా ఓవర్ డ్రాఫ్టులు, సెక్యూరిటీ బాండ్ల వేలంలో అత్యధిక వడ్డీకి RBI దగ్గర అప్పులు తెస్తున్నారు. జులై నెలలో వచ్చిన 2000 కోట్లని ఓవర్ డ్రాఫ్టు ఖాతాలో RBI జమ కట్టేసుకుంది. రెండు నెలల నుంచీ జీతాలు పెన్షన్లు సరిగ్గా రావడం లేదు. పరిస్థితి విషమించితే ఉద్యోగుల స్పందన ఆందోళనకరంగా వుంటుంది.
వేరెక్కడా అప్పు పుట్టక, రాబోయే 15 ఏళ్ల పాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టుపెట్టి 20,000 కోట్లు డబ్బు తెచ్చుకుంది ప్రభుత్వం. సంపూర్ణ మద్యనిషేధం అమలు చేసి తీరతామన్న జగన్రెడ్డి ఇప్పుడేం చేస్తారో చూడాలి. అయితే భవిష్యత్తు ఆదాయాన్ని చూపి అప్పులు తెచ్చుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టింది.
CAG:
కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్ విడిపోయే నాటికి 97,000 కోట్లు అప్పుభారం వుంది. నవంబర్ 2020కి స్థూల ఋణం 3,73,140 కోట్లకి చేరింది. అంటే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి నెత్తిమీద 70,000 రూపాయల అప్పు వుంది. ఇప్పటికే ఏటా 35,000 కోట్ల వడ్డీ కట్టాలి. ఇంకా నెలనెలా తేబోతున్న అప్పులు కలిపితే వడ్డీలు కట్టడానికే ఆదాయం సరిపోదు!పులిమీద స్వారీ:
శ్రీ జగన్ మోహనరెడ్డి ప్రభుత్వం ఈ పరిస్థితినుంచి బయటపడుతుందా, 40 మంది సలహాదారులున్న ప్రభుత్వానికి అసలు ఒక plan of action అంటూ ఉందా అనే చర్చ మేధావుల్లోనే కాదు వైసీపీ సానుభూతిపరుల్లోనూ నడుస్తుంది.బెయిలు రద్దయి జైలుకి పొతే దానిని మళ్ళీ సానుభూతికి వాడుకోవచ్చు అనే వ్యూహం పారే అవకాశం తక్కువ. వచ్చే రెండున్నరేళ్ళ పాటు నిధులు ఎక్కడనుంచి వస్తాయి. జగన్రెడ్డి ప్రభుత్వం తన బరువుకి తానే కుప్పకూలుతుందా? ప్రభుత్వం దివాళా తీస్తే పరిస్థితి ఏంటి? వేచి చూడాలి..
ఒకప్రక్క రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయి అప్పులు విపరీతంగా పెరిగిపోయిన పరిస్తితుల్లో, ఏలిన ప్రభువుల, వారి అనుచరుల, వందిమాగధుల ఆస్తులు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నాయి.
Comments
Post a Comment